టీకా వేసుకున్నా కరోనా రావచ్చు!

ABN , First Publish Date - 2020-12-11T12:14:11+05:30 IST

కొవిడ్‌ టీకా వేసుకున్న తర్వాత మాస్కు ధరించాల్సిన అవసరం లేదా?

టీకా వేసుకున్నా కరోనా రావచ్చు!

వాషింగ్టన్‌ : కొవిడ్‌ టీకా వేసుకున్న తర్వాత మాస్కు ధరించాల్సిన అవసరం లేదా? భౌతికదూరాన్ని వదిలేయొచ్చా? కరోనా ని‘బంధనాల’ను తెంచేయొచ్చా? అంటే.. కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా కొంత కాలం పాటు మాస్కు ధరించక తప్పదంటున్నారు. భౌతికదూరం సహా కరోనా జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా టీకా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు.. ఫైజర్‌ టీకా అయితే.. రెండు వారాలు.. మొడెర్నా అయితే నాలుగు వారాల సమయం ఉంటుంది. టీకాల ప్రభావం అవి తీసుకున్న వెంటనే కనిపించదని, అందుకు కనీసం రెండు వారాలు పడుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నిపుణుడు డెబోరా ఫుల్లర్‌ తెలిపారు.


అంటే.. ఆ రెండు వారాలూ మాస్కు ధరించడంతో పాటు నిబంధనలు కూడా పాటించాల్సిందే అని వివరించారు. అలాగే రెండో డోసు తర్వాత కూడా మరో రెండు వారాల పాటు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని సూచిస్తున్నారు. అసలు.. టీకా.. కరోనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందా.. లేకపోతే లక్షణాలు మాత్రం కనబడకుండా చేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదని తెలిపారు. టీకాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ తర్వాత ఆరు నెలల్లో అమెరికా మంద రోగ నిరోధక శక్తిని సాధిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు.

Updated Date - 2020-12-11T12:14:11+05:30 IST