కరోనా దెబ్బకు దక్షిణాది రాష్ట్రాలు విలవిల.. ఇవాల్టి లెక్కలివే..!
ABN , First Publish Date - 2020-07-28T00:46:56+05:30 IST
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీలో ఇవాళ 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా...

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీలో ఇవాళ కూడా 6వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా కోవిడ్-19 కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి. కేరళ పరిస్థితి గతంతో పోల్చుకుంటే పూర్తిగా మారిపోయింది. రోజుకు 7,8 కేసుల కంటే తక్కువగా నమోదయిన సందర్భాలు కూడా కేరళలో ఉన్నాయి. అలాంటి స్థితి నుంచి.. సోమవారం కొత్తగా 702 కరోనా కేసులు, రెండు కరోనా మరణాలు నమోదయిన పరిస్థితికి కేరళ చేరింది. కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,727కి చేరింది. కేరళలో మొత్తం 495 ప్రాంతాలను కోవిడ్-19 హాట్‌స్పాట్స్‌గా ప్రభుత్వం ప్రకటించింది.
ఇక.. మరో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో కొత్తగా 5,324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు.. కరోనా వల్ల ఇవాళ ఒక్కరోజే 75 మంది మరణించినట్లు వెల్లడించింది. దీంతో.. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 1,01,465కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 61,819. ఇప్పటివరకూ కర్ణాటకలో 1,953 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
ఇక కరోనా కల్లోలానికి అల్లాడుతున్న మరో దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. గత 24 గంటల్లో తమిళనాడులో 6993 కరోనా కేసులు, 77 కరోనా మరణాలు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,20,716కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 54,896. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడం, ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు కరోనాను అంత సీరియస్‌గా తీసుకోకుండా గతంలో మాదిరిగా రోడ్ల పైకి వస్తుండటం కొంత ఆందోళన కలిగించే విషయం.