ఉత్తరాఖండ్‌ సీఎంకు కరోనా

ABN , First Publish Date - 2020-12-19T07:09:04+05:30 IST

దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారినపడ్డారు. ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌కు శుక్రవారం పాజిటివ్‌ వచ్చింది.

ఉత్తరాఖండ్‌ సీఎంకు కరోనా

దేశంలో కొత్తగా 22,890 కేసులు;

338 మంది మృతి..

నేడు కోటికి చేరనున్న మొత్తం పాజిటివ్‌లు

ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో దేశం

మరణాల రేటు మన దగ్గరే అతి తక్కువ


న్యూఢిల్లీ, డిసెంబరు 18: దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారినపడ్డారు. ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌కు శుక్రవారం పాజిటివ్‌ వచ్చింది. ఇంతకుముందు మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గోవా, హరియాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది. ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ ఎయిమ్స్‌ ట్రామా కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో గురువారం 22,890 కేసులు నమోదయ్యాయి. 338 మంది మృతి చెందారు. కొత్త కేసులు 30 వేల దిగువన ఉండటం వరుసగా ఐదో రోజు కాగా, మరణాలు 400 దిగువన నమోదు కావడం ఆరో రోజు. 3.13 లక్షల యాక్టివ్‌ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్నవారు 30 రెట్లు అధికమని పేర్కొంది. తాజాగా 31,087 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీలు 95,20,827కు చేరాయి. కోవ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న అనంతరం కరోనా నిర్ధారణ అయిన.. హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ (67)ను గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు.  కేరళలో గురువారం 4,969 మందికి వైరస్‌ సోకింది. ఢిల్లీలో మూడున్నర నెలల అత్యల్ప సంఖ్యలో 1,300 కేసులు వచ్చాయి.


పది నెలలు..  కోటి కేసులు!

దేశంలో కరోనా కేసులు శనివారంతో కోటికి, పరీక్షలకు 16 కోట్లకు చేరనున్నాయి. ప్రస్తుతం 99,79,447 లక్షల కేసులున్నాయి. జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైంది. అప్పటినుంచి చూస్తే దాదాపు 10 నెలల 15 రోజులకు బాధితులు కోటికి చేరారు. ప్రపంచవ్యాప్త కేసులు 7.5 కోట్లు కాగా.. అమెరికా (సుమారు 1.77 కోట్ల కేసులు) తర్వాత అత్యధిక పాజిటివ్‌లు మనదగ్గరే నమోదయ్యాయి. అంతేకాక, కోటి కేసులు వచ్చిన రెండో దేశం భారత్‌ కానుంది. ఓ దశలో బ్రెజిల్‌ (71 లక్షలు)లో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదైనా.. తర్వాత నెమ్మదించాయి. మరణాల పరంగా చూస్తే భారత్‌ (1,44,789) కంటే బ్రెజిల్‌ (1.85 లక్షలు)లోనే ఎక్కువగా ఉన్నాయి.  పది లక్షల జనాభాకు కేసులు భారత్‌ (7,199)లోనే అతి తక్కువ. ఈ విషయంలో అమెరికా (53 వేలు), బ్రెజిల్‌ (33 వేలు), ఫ్రాన్స్‌ (37 వేలు), స్పెయిన్‌ (38 వేలు)లో చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయి.  కేసులపరంగా మొదటి 5 స్థానాల్లో ఉన్న అమెరికా (1.88), బ్రెజిల్‌ (2.60), రష్యా (1.79), ఫ్రాన్స్‌ (2.45) కంటే మరణాల రేటు భారత్‌ (1.45)లోనే మెరుగ్గా ఉండటం గమనార్హం.


లక్ష కేసుల తర్వాత ఇప్పుడే అత్యధిక వ్యవధి

దేశంలో కరోనా కేసులు మే 18న లక్షకు చేరాయి. ఆ తర్వాత 58 రోజుల్లోనే  పది లక్షలు అయ్యాయి. అనంతరం 21 రోజులకు 20 లక్షలకు, మరో 13 రోజులకు 30 లక్షలకు చేరాయి. ఆపై 11 రోజులకు 40 లక్షలకు, తదుపరి 12 రోజులకు 50 లక్షలు, మరో 13 రోజులకు 60 లక్షలు, తర్వాత 13 రోజులకు 70 లక్షలు, అనంతరం 18 రోజులకు 80 లక్షలు, మరో 22 రోజులకు 90 లక్షలకు చేరాయి. 90 లక్షల నుంచి కోటికి 28 రోజులు పడుతోంది. లక్ష కేసుల తర్వాత ఇదే ఎక్కువ వ్యవధి. కరోనా ఉధృతంగా ఉన్న సెప్టెంబరు నెలలో 11 రోజుల్లోనే పది లక్షల కేసులు వచ్చాయి. క్రమేపీ సమయం పెరుగుతూ వచ్చింది.

Updated Date - 2020-12-19T07:09:04+05:30 IST