ట్రంప్‌కు కరోనా
ABN , First Publish Date - 2020-10-03T07:39:16+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొవిడ్-19 బారిన పడ్డారు. తనకు, భార్య మెలానియాకు వైరస్ సోకిందని ఆయనే స్వయంగా ప్రకటించారు...

- భార్య మెలానియాకూ కోవిడ్
శ్వేతసౌధంలోనే దంపతుల క్వారంటైన్
ప్రస్తుతానికి ఇబ్బందులేవీ లేవన్న వైద్యులు
వయసు, ఊబకాయంతో సమస్యల ముప్పు
మాస్క్ వాడరు.. భౌతిక దూరం పాటించరు
ఇది ట్రంప్ స్వయంకృతమన్న నిపుణులు
ఇక ఆయన ప్రచారానికి వెళ్లడం డౌటే
బైడెన్‌కు కరోనా నెగెటివ్
అధ్యక్షుడికి కరోనా వార్తతో మార్కెట్లు డౌన్
‘‘కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం... ఈ శత్రువును మనం నిర్మూలించగలం.’’ అని జూన్ 14న ధీమాగా ప్రకటించిన అగ్రరాజ్య అధినేత ఇపుడు అదే సూక్ష్మజీవి దెబ్బకు విలవిల్లాడుతున్నారు. అమెరికాలో రెండు లక్షల మందిని బలిగొన్న కరోనావైరస్ శ్వేతసౌధంపై పంజా విసిరింది. కొవిడ్-19 విషయంలో ఆయనవి ఎప్పుడూ వెక్కిరింతలు, హేళనలే.. అదుగో వ్యాక్సిన్.. ఇదిగో వ్యాక్సిన్ అంటూ మభ్యపెట్టే ప్రకటనలే... ఈ చులకన భావమే ఆయనను మంచాన పడేసింది. మరో నెలరోజుల్లో అధ్యక్ష ఎన్నికలకు వెళ్లబోతున్న వేళ అగ్రరాజ్యం తాజా పరిణామంతో పూర్తి అనిశ్చితిలో పడింది.
వాషింగ్టన్, అక్టోబరు 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొవిడ్-19 బారిన పడ్డారు. తనకు, భార్య మెలానియాకు వైరస్ సోకిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘‘నాకు, ఫస్ట్ లేడీకి కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇద్దరం దీన్నుంచి బయటపడతాం’’ అని ఆయన- శుక్రవారం తెల్లవారు జామున ట్వీట్ చేశారు. ఒక అమెరికా అధ్యక్షుడు ఇంత పెద్ద ఆరోగ్య సమస్య ఎదుర్కొనడం కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రఽథమం. ముఖ్యంగా మరో 31 రోజుల్లో (నవంబరు 3న) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇది ఆకస్మిక, అనూహ్య, సంచలన పరిణామం. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి బరిలో దిగిన ట్రంప్- ఇక దాదాపుగా ప్రచారానికి వెళ్లలేని పరిస్థితి. ‘‘అధ్యక్షుడు, తొలి మహిళ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. వారిద్దరికీ ఎలాంటి సమస్యలూ లేవు. క్వారంటైన్ సమయంలో వారు శ్వేతసౌధంలోనే ఉండాలనుకుంటున్నారు. వైట్‌హౌస్ నుంచే ఆయన అధికారిక విధులు నిర్వర్తిస్తారు’’ అని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే చెప్పారు. అయితే ట్రంప్‌కు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వైట్‌హౌస్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ గ్రీషమ్ చెప్పారు.
కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ద్వారా..?
శ్వేతసౌధ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హోప్ హిక్స్ ద్వారా ట్రంప్ దంపతులకు కరోనా సోకి ఉండవచ్చన్నది అనుమానం. ఆమెకు రెండ్రోజుల కిందటే కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ట్రంప్ కుటుంబానికి ఆమె సన్నిహితురాలు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు.. రిపబ్లికన్ పార్టీ వ్యూహ నిర్మాణంలోనూ ఆమె పాల్గొంటున్నారు. నగురువారం జరిగిన న్యూజెర్సీ సభకు కూడా ఆమె వెళ్లారు. అప్పటికే ఆమెకు కరోనా సోకినట్లు వైట్‌హౌ్‌సలోని కొందరికి తెలుసు. అయినా ట్రంప్ ఖాతరు చేయలేదు. హోప్ హిక్స్‌కు కొవిడ్‌ను ఆయన బుధవారంనాడు ఫాక్స్ న్యూస్ చర్చలో కొట్టిపారేశారు కూడా..!
మైక్‌పెన్స్‌కు నెగటివ్...
ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్‌పెన్స్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. తన భార్య జిల్‌కు కూడా నెగిటివే ఉందని ఆయన ట్విటర్ ద్వారా తెలియపరిచారు. ఇక ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జేడ్ కుష్నర్, కొడుకు బేరన్ ట్రంప్‌లకు కూడా నెగిటివే వచ్చిందని వైట్‌హౌస్ ప్రకటించింది.
విచ్చలవిడితనం..
కొవిడ్‌ను ట్రంప్ చాలా నిర్లక్ష్యంగా, తేలిగ్గా తీసుకున్నారు. మాస్క్ పెట్టుకునేవారు కాదు. భౌతిక దూరం పాటించడం ఆయనకు అస్సలు ఇష్టం లేని పని. నాకేం కాదు.. అన్న ధీమాతో.. వేల మంది ప్రజలు, మద్దతుదారులు హాజరైన ప్రచార సభలకు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా వెళ్లేవారు.
ఆ సభల్లో కూడా సీడీసీ చెప్పిన నిబంధనలను కాలరాసి ఆయన, రిపబ్లికన్ మద్దతుదారులు తిరిగారు. ‘‘రిపబ్లికన్ సమావేశాలు ఇన్‌డోర్ స్టేడియాల్లోనే జరిగేవి. వేలమంది గుమిగూడడం, ఎవరూ మాస్క్‌లు పెట్టుకోకుండా, దూరం పాటించకుండా ఉండడం కొంపముంచింది. ఇది ఆయన స్వయంకృతం’’ అని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఊపిరితిత్తుల నిపుణుడైన డాక్టర్ విన్ గుప్తా వ్యాఖ్యానించారు. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడానికి కూడా తొలుత సంశయించారు.
బైడెన్‌ను హేళన చేసిన వేళ..
క్లీవ్‌లాండ్‌లో జరిగిన తొలి ముఖాముఖిలో సైతం ట్రంప్ కరోనా భయం గురించి పలుచన చేసే మాట్లాడారు. ప్రత్యర్థి జో బైడన్‌ను హేళన చేశారు. ‘‘మాస్క్ పెట్టుకుని ప్రజలకు దూరంగా ఉండే మీరు అమెరికన్లకు ఏం చేరువవుతారు? ప్రపంచంలో నేను చూసిన అతి పెద్ద మాస్క్ మీరే..’’ అని ఆక్షేపించారు. ‘‘సామాజిక దూరం పాటించకుండా, మాస్క్ ధరించకుండా ఇలా ఇష్టానుసారం తిరుగుతూ, మీ అధీనంలోనే ఉన్న సీడీసీ ఇచ్చిన జాగ్రత్తలను మీరే బేఖాతరు చేస్తూ వెళుతున్నారు. మీ అసమర్థ నిర్వాకం వల్లే లక్షల మంది చనిపోయారు’’ అని బైడెన్ దుమ్మెత్తినపుడు.. ‘‘నేను సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లే మరణాల సంఖ్య తగ్గింది. లేదంటే 20 లక్షలు దాటేది’’ అని ట్రంప్ బదులిచ్చారు.
ఎన్నికలపై ప్రభావం..!
కొవిడ్ బారిన పడడంతో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బాధ్యతలు నిర్వహించలేరని విశ్లేషకులంటున్నారు. ఈ నెల 15న మియామిలో జరగాల్సిన అధ్యక్ష అభ్యర్థుల రెండో ముఖాముఖి చర్చ వాయిదా పడ్డట్లేనంటున్నారు. మూడోది కూడా డౌటే..! ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే ఉన్నందున ట్విటర్ ద్వారా తన మనోభావాలను ఓటర్లకు తెలియపరుస్తూనే ఉంటారని అంటున్నారు. కొవిడ్ అదుపులో తన ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎప్పుడూ ఒప్పుకోలేదు. డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల సహాయనిరాకరణ వల్లే పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆక్షేపించేవారు. దేన్నైతే చులకన చేశారో దాని బారిన పడడంతో ఆయన డిఫెన్స్‌లో పడినట్లేనని విశ్లేషకులంటున్నారు. ఇక కొవిడ్ వల్ల ఆయన విస్కాన్‌సిన్, ఫ్లోరిడా, అరిజోనా, వాషింగ్టన్‌లలో జరపాల్సిన ప్రచార సభలు, నిధుల సేకరణ ర్యాలీలు రద్దయ్యాయి. ప్రత్యర్థి అనారోగ్య బారిన పడడం డెమోక్రాట్ అభ్యర్థి జో బైడన్‌కు ఎంతమేర కలిసొస్తుందన్నది కూడా సందేహమే. ఎందుకంటే బైడన్ వయసూ తక్కువ కాదు. ఆయనకు 79 ఏళ్లు. బయట ఎక్కువగా తిరిగితే కరోనా సోకే ప్రమాదముంది. అయితే.. ట్రంప్ క్వారంటైన్‌లో ఉండాల్సిన సమయం 14 రోజులు. ఆ తర్వాత ఆయన బయట తిరిగేస్తారన్న అంచనాలూ ఉన్నాయి.
అధ్యక్షుడు అనారోగ్యం పాలవడంతో అమెరికా రక్షణ, భద్రత యంత్రాంగం అప్రమత్తమైంది. దేశం సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ ప్రత్యర్థి దేశాలు, ఇస్లామిక్ గ్రూపులు చెలరేగిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పెంటగాన్ తెలిపింది. విదేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాలను అప్రమత్తం చేశారు.
ఎంత ప్రమాదం ?
అమెరికా అధ్యక్షుడు గనక ట్రంప్‌కు అత్యున్నత వైద్య సదుపాయాలు ఎటూ అందుబాటులో ఉంటాయి. అయితే ఆయన వ్యక్తిగత జీవన శైలి, ఆరోగ్యం ఎంతవరకు కొవిడ్‌ను అదుపులోకి తెస్తాయన్నది ప్రశ్న. ట్రంప్ వయసు 74 ఏళ్లు. బరువు 111 కిలోలు. కొలస్ట్రాల్ స్థాయి కూడా చాలా ఎక్కువ. అమెరికాలో 62-74 ఏళ్ల వయస్కులు హైరిస్క్ జోన్‌లో ఉన్నట్లు, యువతతో పోలిస్తే ఈ ఏజ్ గ్రూపు వారికి 90ు అధికంగా మరణావకాశాలు ఉన్నట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) గతంలోనే తెలిపింది. ట్రంప్‌కు బాడీ మాస్ ఇండెక్స్ 30.5 ఉన్నట్లు తేలింది. ఇంత ఊబకాయం ఉన్నవారు తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుందని కూడా సీడీసీ వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం ఆయనకు బీపీ పెరిగింది. రెండేళ్ల కిందట ఆయనకు హృద్రోగ సమస్యలున్నట్లు తేలింది.
జో బైడెన్‌కు నెగెటివ్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రాట్ అఽభ్యర్థి జో బైడెన్‌కు కరోనా సోకలేదు. క్లీవ్‌లాండ్‌లో చర్చ సమయంలో ట్రంప్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే బైడెన్ ఉన్నారు. గాలిలో తుంపర్ల ద్వారా ఇది వ్యాపించే ప్రమాదం ఉందని, బైడెన్‌కూ సోకి ఉండవచ్చని కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే.. ఆయనకు, ఆయన భార్యకూ పరీక్ష చేసినపుడు నెగిటివే వచ్చిందని బైడెన్ వ్యక్తిగత డాక్టర్ కెవిన్ కానర్ తెలిపారు.
త్వరగా కోలుకోండి: మోదీ, రాష్ట్రపతి
న్యూఢిల్లీ, అక్టోబరు 2: కొవిడ్-19 నుంచి ట్రంప్ వేగంగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ ద్వారా ఆకాంక్షించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇదే మాటన్నారు.
చైనా హేళన
ట్రంప్ కరోనా బారిన పడ్డ విషయంలో ప్రపంచదేశాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఐరోపా, ఉత్తర దక్షిణ అమెరికా దేశాలు దిగ్ర్భాంతిని, సానుభూతిని వ్యక్తం చేయగా, కొన్ని ఇస్లామిక్ దేశాలు హేళన చేశా యి. ఈ కష్ట సమయంలో మీకు మా పూర్తి మద్దతుంటుంది అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ మాత్రం ఎగతాళి చేసింది. ‘‘కరోనావైర్‌సను తక్కువ చేసి చూసినందుకు ట్రంప్ దంపతులు తగిన మూల్యం చెల్లించారు. అమెరికాలో పరిస్థితికి ఇది అద్దంపడుతోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలపై ఈ పరిణామం ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని గ్లోబల్ టైమ్స్ చీఫ్ హూ షిజిన్ అన్నారు. ఇరాన్, సిరియా, ఇరాక్‌లోని ఇస్లామిక్ గ్రూపులు, టర్కీ నెగెటివ్‌గా స్పందించాయి. ఇప్పటికి తెలిసొచ్చిందా? అంటూ ఎద్దేవా చేశాయి.
ఒకవేళ పరిస్థితి విషమిస్తే...!
ట్రంప్ ఆరోగ్యం విషమించి, విధులు నిర్వర్తించలేని పరిస్థితే తలెత్తితే.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తాత్కాలిక అధ్యక్షుడవుతారు. 1963లో జాన్ ఎఫ్ కెనెడీ హత్య తర్వాత.. 1967లో అమెరికా రాజ్యాంగాన్ని సవరించారు. అందులోని 25వ సవరణ సెక్షన్3 ప్రకారం అధ్యక్షుడు బాధ్యతలు నిర్వర్తించలేకపోతే ఆయన స్వయం గా ఉపాధ్యక్షుడికి అధికారాలను బదలాయించవచ్చు. 1985లో రొనాల్డ్ రీగన్ 8 గంటలపాటు తన ఉపాధ్యక్షుడు సీనియర్ జార్జి బుష్‌కు, 2002, 2007ల్లో జూనియర్ బుష్ ఓ రెండేసి గంటల పాటు తన ఉపాధ్యక్షుడు డిక్ చేనీకి బాధ్యతలు అప్పగించారు. కోలుకున్న వెంటనే అధ్యక్షుడు తన ఉత్తర్వులను ఉపసంహరించి, తిరిగి బాధ్యతలను కొనసాగించవచ్చు. ఒకవేళ అధ్యక్ష, ఉపాధ్యక్షులిద్దరూ విధులు నిర్వర్తించలేని పరిస్థితి తలెత్తితే.. ప్రతినిధుల సభ స్పీకర్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే వెసులుబాటు ఉంది.
