ఈ యేడాది మొత్తం కరోనా కల్లోలం...కానీ...!

ABN , First Publish Date - 2020-12-31T01:45:49+05:30 IST

ఈ యేడాది మొత్తం కరోనా కల్లోలం రేపింది. లాక్‌డౌన్‌ కారణంగా క్రైమ్‌ రేట్‌ తగ్గింది. కానీ, కొత్త తరహా నేరాలు పెరిగిపోయాయి. ప్రధానంగా సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు భారీగా..

ఈ యేడాది మొత్తం కరోనా కల్లోలం...కానీ...!

ఈ యేడాది మొత్తం కరోనా కల్లోలం రేపింది. లాక్‌డౌన్‌ కారణంగా క్రైమ్‌ రేట్‌ తగ్గింది. కానీ, కొత్త తరహా నేరాలు పెరిగిపోయాయి. ప్రధానంగా సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు భారీగా నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో చూస్తే సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. సూసైడ్‌ కేసు డ్రగ్స్‌ రాకెట్‌ వైపు దూసుకెళ్లింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇక, హథ్రాస్‌ దుర్ఘటన నిర్భయను తలపించింది. ఆ తర్వాత పరిణామాలు రాజకీయ దుమారం రేపాయి. 28 యేళ్ల తర్వాత సిస్టర్‌ అభయ హత్యకేసులో తీర్పు వెలువడింది. అటు.. నిర్భయ దురాగతంలో నిందితులకు ఉరిశిక్ష అమలయ్యింది. 


2020 యేడాది మొత్తం కరోనా కరాళనృత్యం చేసింది. కులాలు, మతాలు, రాష్ట్రాలు, దేశాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వణికించిందీ మహమ్మారి. ప్రపంచ చరిత్రలో ఏనాడూ కనిపించని, వినిపించని, ఊహించని రీతిలో ప్రభావం చూపించింది. ఇంకా చూపిస్తూనే ఉంది.


అయితే, కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ క్రైమ్‌రేట్‌ తగ్గడానికి కారణమయ్యింది. మనదేశం, రాష్ట్రం అనే కాదు.. ప్రపంచదేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. గొడవలు, ఘర్షణలు, తగాదాలు జరగలేదు. అఘాయిత్యాలకు ఆస్కారం లభించలేదు. జనమంతా ఇళ్లలోనే ఉండిపోవడంతో దొంగతనాలు, దోపిడీలకు ఛాన్స్‌ దొరకలేదు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నన్నాళ్లు పోలీస్‌స్టేషన్లలో కేసుల సంఖ్య దాదాపు జీరోగా రికార్డయ్యింది. ఇది చరిత్రలోనే అరుదైన పరిణామం. అయితే, గృహహింసకు సంబంధించి మాత్రం ఆన్‌లైన్‌, టెలిఫోన్‌ ఫిర్యాదులు పోలీసులకు వెళ్లాయి


వీధుల్లో, ప్రధాన రహదారులపై పోలీసు బలగాలు మోహరించి ఉండటం, రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో ఒకవేళ ఏదైనా నేరం చేసినా నిందితులు తప్పించుకునే అవకాశం దొరకలేదు. దొంగతనం చేసిన వస్తువులను అమ్మటానికి మార్కెట్లు తెరచి లేకపోవటం వంటి వాటి వల్ల క్రైమ్స్ జరగ లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు బార్లు, వైన్ షాపులు మూసివేయటం కూడా నేరాలు జరగకపోవడానికి కారణమైందన్న వాదనలున్నాయి.


దాదాపు ఈ యేడాదిలోని మొదటి ఆరునెలలు ఇదే ఒరవడి కొనసాగింది. ప్రమాదాలు, దారుణాలు, ఘోరాలు పెద్దగా జరగలేదు. ఫలితంగా కేసులు నమోదు కాలేదు. అంటే.. 2020 యేడాది క్రైమ్‌ రేట్‌ అంతా చివరి ఆరునెలల్లో నమోదయినవే. కరోనా లాక్‌డౌన్‌ ముగిసి దశలవారీగా అన్‌లాక్‌డౌన్‌ అమలు చేసిన తర్వాత నేరాలు మళ్లీ మొదలయ్యాయి. క్రమంగా క్రైమ్‌ రేట్‌ పైకి ఎగబాకింది. ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే, గడిచిన సంవత్సరాల్లో నమోదైన స్థాయిలో మాత్రం నేరాల సంఖ్య నమోదు కాలేదు. ఇది ఒకరకంగా ఆశాజనకమైన పరిణామమని చెప్పవచ్చు.


అయితే, కరోనా కారణంగా ఈ యేడాది సాధారణ నేరాలు తక్కువగా నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నా సైబర్‌ నేరాలు మాత్రం పెరిగాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్స్‌ దోపిడీలు, లోన్‌ యాప్స్‌ దురాగతాలు, ఆన్‌లైన్‌ ఆర్థిక నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. పైగా ఈ యేడాది కొత్తగా ఫేస్‌బుక్‌ నుంచి మనీ రిక్వెస్ట్‌ మోసాలు వెలుగుచూశాయి. సమాజంలో పేరూ, ఫాలోయర్లు ఎక్కువగా ఉన్నవారి ఫేస్‌బుక్‌ ఎకౌంట్లను సైబర్‌ నేరగాళ్లకు అవకాశంగా మలుచుకున్నారు. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా ఈ కొత్తతరహా మోసం బయటపడింది. ఒక్క తెలంగాణలోనే ఐదుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 35 మంది కానిస్టేబుళ్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించినట్లు తేలింది. 


ప్రధానంగా హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లతో తప్పుడు ఫేస్‌బుక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి వాళ్ల ఫ్రెండ్స్‌కు అర్జంట్‌గా డబ్బులు కావాలంటూ మెస్సేజ్‌లు చేశారు. గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా రిక్వెస్ట్‌ పంపించారు. ఫేస్‌బుక్‌ మెస్సేజ్‌లో డబ్బులు అడిగిన వాళ్లు పోలీసులు, ప్రముఖులు కావడంతో చాలామంది వాళ్లు చెప్పిన నెంబర్లకు గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించారు. రాజస్థాన్‌కు చెందిన ఆ అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 230 మంది పోలీసు అధికారుల పేరుతో వీళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలను తెరిచినట్లు గుర్తించారు.


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-12-31T01:45:49+05:30 IST