మృతదేహాలకు పరీక్షలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

ABN , First Publish Date - 2020-06-18T07:38:27+05:30 IST

ఆస్పత్రుల్లో మరణించే వారి మృతదేహాలకూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేసులో ప్రతివాదులకు నోటీసులిచ్చింది...

మృతదేహాలకు పరీక్షలు..  హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో మరణించే వారి మృతదేహాలకూ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేసులో ప్రతివాదులకు నోటీసులిచ్చింది. మృతదేహాలకు పరీక్షలపై హైకోర్టు ఉత్తర్వులతోపాటు తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.


రాష్ట్ర  ప్రభుత్వం దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు ధిక్కరణ ఆదేశాలపై కూడా స్టే విధించింది. ఈ విషయంలో హైకోర్టు ‘తొందరపాటు’తో ఉత్తర్వులిచ్చిందని, ఇవి ‘అవాంఛనీయమైనవని’ స్పష్టం చేసింది. తాము ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కేసు విచారణకు ప్రభుత్వం తరఫున న్యాయవాది శ్యామ్‌దివన్‌, ప్రభుత్వ న్యాయవాది ఉదయ్‌కుమార్‌ సాగర్‌ హాజరయ్యారు. సరిపడా ఎక్వి్‌పమెంట్‌, టెస్టింగ్‌ కిట్‌లు లేకనే పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్న పద్ధతిని అనుసరిస్తున్నామని పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై డిమాండ్‌ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నామని స్పష్టం చేసింది.


Updated Date - 2020-06-18T07:38:27+05:30 IST