టెస్టులు పెంచండి

ABN , First Publish Date - 2020-06-26T06:47:45+05:30 IST

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విస్తృతంగా యాంటీబాడీ, యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించాలని భారత వైద్య పరిశో ధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా మార్గదర్శకాల్లో సూచించింది...

టెస్టులు పెంచండి

  • అన్ని ఆస్పత్రులు, కార్యాలయాలు, పీఎస్‌యూల్లో
  • యాంటీబాడీ, యాంటీజెన్‌ పరీక్షలు చేయండి
  • ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో కీలక సూచన

న్యూఢిల్లీ, జూన్‌ 25: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా  వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విస్తృతంగా యాంటీబాడీ, యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించాలని భారత వైద్య పరిశో ధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా మార్గదర్శకాల్లో సూచించింది. కేవలం కట్టడి ప్రాంతాలకే పరిమితం కాకుండా.. ఆస్పత్రులు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ విభాగాలు ఇలా అన్నిచోట్లా యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను నిరంతరం తమతో పంచుకోవాలని పేర్కొంది. తద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయడం సులవవుతుందని.. ఆ సమాచారం ఆధారంగా విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి వీలవుతుందని వివరించింది.


వైద్యసిబ్బందిలో ఉన్న భయాలను.. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ద్వారా తగ్గించవచ్చని అభిప్రాయపడింది. అయి తే, ఈ పరీక్షలు పరిస్థితిని అంచనా వేయడానికే. కరోనా సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాల్సిందే. యాంటీబాడీ టెస్టులతో పాటు.. వైరస్‌ విస్తృతిని ముందే గుర్తించేందుకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు కూడా చేయాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ‘‘వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉన్న ఏకైక మార్గం.. టెస్ట్‌ (పరీక్షలు చేయడం), ట్రాక్‌ (వైరస్‌ సోకినవారిని గుర్తించడం), ట్రీట్‌ (చికిత్స చేయడం). కాబట్టి దేశవ్యాప్తంగా.. అనుమానిత లక్షణాలున్నవారందరికీ పరీక్షలను అందుబాటులో ఉంచడం తప్పనిసరి. అలాగే, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ విధానాలను కూడా మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఐసీఎంఆర్‌ పేర్కొంది. 


ఏయే రాష్ట్రాల్లో ఎక్కువంటే..

ఏపీలో యాంటీబాడీ టెస్టులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేసేందుకు ఏపీ సర్కారు ఏప్రిల్‌లోనే దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్ట్‌ కిట్లను తెప్పించింది. అవి రాకముందు కూడా ఏపీలో భారీగా టెస్టులు చేశారు. ఇక.. ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలూ తమ ఉద్యోగులకు యాంటీబాడీ టెస్టులు చేయించాలని ఆ రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఢిల్లీ సర్కారు కూడా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఢిల్లీలో 193 ల్యాబుల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం వీటిని ప్రారభించిన తొలిరోజు 7,040 మందిని పరీక్షించగా.. 456 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక.. తెలంగాణలో సర్కారు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే నిర్వహిస్తోంది తప్ప ఎక్కడా యాంటీబాడీ పరీక్షలు చేయలేదు. ఐసీఎంఆర్‌ వాళ్లే 2 సార్లు కొన్ని జిల్లాల్లో మాత్రం యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు. కాగా, కొవిడ్‌-19 పరీక్షల నిమిత్తం సేకరించిన నమూనాలను.. టెస్టు పూర్తయ్యాక వెంటనే ధ్వంసం చేయొద్దని, కనీసం 30 రోజులపాటు నిల్వ ఉంచాలని దేశంలోని అన్ని ప్రభుత్వ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ సూచించింది. 


Updated Date - 2020-06-26T06:47:45+05:30 IST