ఇంట్లోనే కరోనా పరీక్ష
ABN , First Publish Date - 2020-04-05T07:42:07+05:30 IST
జలుబు, దగ్గు, గొంతునొప్పి.. చాలామందికి అప్పుడప్పుడూ వచ్చేవే! కానీ, ఇప్పుడు ఆ మూడిట్లో ఏదొచ్చినా భయపడే పరిస్థితి!! కరోనాయేమోనని అనుమానించే దుస్థితి. అలాగని ఆస్పత్రికి వెళ్లి...

కిట్ విడుదల చేసిన బయోనీ
ఖరీదు 2 వేలు.. కచ్చితత్వం 99%
భారత్‌లో ఇలాంటి కిట్ తొలిసారి
జలుబు, దగ్గు, గొంతునొప్పి.. చాలామందికి అప్పుడప్పుడూ వచ్చేవే! కానీ, ఇప్పుడు ఆ మూడిట్లో ఏదొచ్చినా భయపడే పరిస్థితి!! కరోనాయేమోనని అనుమానించే దుస్థితి. అలాగని ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలంటే పెద్ద పెద్ద క్యూలు. చుట్టుపక్కలవారు అనుమానంగా చూసే పరిస్థితి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఇంట్లోనే ఎవరికి వారు కొవిడ్-19 పరీక్ష చేసుకోగలిగితే? బెంగుళూరుకు చెందిన బయోనీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటి ‘హోమ్ స్ర్కీనింగ్ కిట్’ను విడుదల చేసింది. మన దేశంలో ఈ తరహా కిట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టడం ఇది తొలిసారి. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో కేవలం పది నిమిషాలలో చెప్పే ఈ కిట్ ఖరీదు రెండు వేల రూపాయలే. ఈ కిట్‌కు సంబంధించిన విశేషాలను బయోనీ కంపెనీ ఫౌండర్ డాక్టర్ సురేందర్ చికారా ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
ఈ కిట్ ఎలా పనిచేస్తుంది?
మధుమేహ పరీక్షలు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న కిట్లలాగానే ఇదీ పనిచేస్తుంది. ఈ కిట్‌తో పాటు ఒక సూది ఇస్తాం. దాన్ని ఉపయోగించి రక్తాన్ని తీసి కిట్‌పై వేయాలి. వేసిన 10 నిమిషాల్లో.. కరోనా సోకిందీ లేనిదీ తేలిపోతుంది. ఒకవేళ ఇందులో పాజిటివ్ వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మళ్లీ పరీక్ష చేయించుకోవటం మంచిది. ఈ కిట్‌ను ఆపరేట్ చేయటం చాలా సులభం. కిట్‌తో పాటు వచ్చే మాన్యువల్‌ను చదివితే సరిపోతుంది.
ఈ కిట్ కచ్చితత్వం ఎంత?
93 నుంచి 99 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వస్తాయి. ఒకసారి పరీక్షలో నెగటివ్ వచ్చినా.. రోగ లక్షణాలు కనిపిస్తే ఏడు రోజుల తర్వాత మళ్లీ పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే వైరస్ వ్యాప్తికి ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది. అందువల్ల మళ్లీ పరీక్ష చేయించుకోవాలని చెబుతున్నాం.
గిరాకీకి తగ్గట్టు సరఫరా చేయగలరా?
ఈ కిట్‌ను రెండు వేల రూపాయలకు అమ్మాలనుకుంటున్నాం. ఇదే కిట్ ఖరీదు యూర్‌పలో చాలా ఎక్కువ. కానీ మన దేశంలో తక్కువ ఖరీదుకు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వారానికి 20 వేల కిట్‌లను సరఫరా చేయగలం. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో వీటి ఉత్పత్తి పెంచుతాం. ఈ కిట్‌లు ప్రస్తుతం బయోనీ డాట్ ఇన్‌లో దొరుకుతున్నాయి. మాకు ఆర్డర్ ఇచ్చిన రెండు రోజుల్లో సరఫరా చేస్తాం. భవిష్యత్తులో వీటిని ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారా కూడా సరఫరా చేస్తాం.
ఈ కిట్ వైర్‌సను ఎలా గుర్తిస్తుంది?
ప్రతి వైర్‌సకూ ఒక ప్రత్యేకమైన జన్యు సంకేతంఉంటుంది. దాని ఆధారంగా వైర్‌సను గుర్తించవచ్చు. గతంలో ఇతర రకాల వైర్‌సలను కనిపెట్టే కిట్‌లను రూపొందించాం. ఈ కిట్ కూడా ఆ పద్ధతిలోనే పనిచేస్తుంది. అనేక రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లో ప్రవేశపెట్టాం. దీనికి అమెరికా సంస్థల అనుమతులతో పాటు మన దేశానికి చెందిన ఐసీఎంఆర్ అనుమతి కూడా ఉంది.
-స్పెషల్ డెస్క్