కరోనా లక్షణాలు వేరయా!

ABN , First Publish Date - 2020-07-27T07:54:31+05:30 IST

జలుబు వస్తే ముక్కు కారుతుంది! గొంతు నొప్పిగా ఉంటే.. ఇన్ఫెక్షన్‌ అని అర్థమవుతుంది.

కరోనా లక్షణాలు వేరయా!

  • అసలే సీజనల్‌ వ్యాధుల సమయం
  • జలుబు, దగ్గు, జ్వరాలు సాధారణం
  • కరోనా పేషెంట్లలోనూ అవే లక్షణాలు
  • ప్రాణవాయువు స్థాయి తగ్గడం అదనం
  • ఆక్సిజన్‌ స్థాయి బాగా తగ్గేదాకా.. 
  • మామూలుగానే ఉంటున్న శ్వాస
  • తెలిసేసరికే మించిపోతున్న సమయం
  • ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ఫలితం
  • ఛాతీ నొప్పి, నొక్కినట్టుగా ఉండడం..
  • పెదవులు నల్లగా అవడం తీవ్ర లక్షణాలు
  • పల్స్‌ ఆక్సీమీటర్‌తో చెక్‌ చేసుకోవాలి
  • ఆక్సిజన్‌ స్థాయి 90% కన్నా తగ్గితే
  • వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి: వైద్యులు


జలుబు వస్తే ముక్కు కారుతుంది! గొంతు నొప్పిగా ఉంటే.. ఇన్ఫెక్షన్‌ అని అర్థమవుతుంది. మరి.. కరోనా సోకితే? ఈ లక్షణం కనపడితే పక్కాగా కరోనా సోకినట్టే.. అని గట్టిగా చెప్పడం కష్టం. సీజనల్‌గా వచ్చే జలుబు, ఫ్లూ లక్షణాలే కరోనా సోకిన కొందరిలో కనపడుతున్నాయి. అంటే కొద్దిగా జ్వరం, దగ్గు వంటివి. మరికొందరిలో అవీ కనపడట్లేదు. ఏ లక్షణాలూ లేకుండా 

వచ్చిపోతోందంతే.


కరోనా వైరస్‌ మనదేశంలో ప్రవేశించినప్పుడు శీతాకాలం ముగిసి ఎండాకాలం మొదలవుతోంది. దానికితోడు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేశారు. దీనివల్ల కేసుల తీవ్రత తక్కువే ఉంది. కానీ, వర్షాకాలం ప్రవేశించడం.. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు ఒకేసారి జరగడంతో వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. మామూలుగానే ఇది సీజనల్‌ వ్యాధులు వచ్చే కాలం. గతంలో అయితే ఈ సమయంలో జలుబు చేస్తే సహజంగా భావించేవాళ్లం.


కానీ, ఇప్పుడు అలా అని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. ‘‘అది కరోనా జలుబా? మామూలు జలుబా? జ్వరం వస్తే అది మామూలు జ్వరమా లేక కరోనా వల్లనా?..’’ ఇలా ఎన్నో సందేహాలు. ఎయిమ్స్‌ వైద్యులు చేసిన అధ్యయనం ప్రకారం మనదేశంలో కొవిడ్‌ పేషెంట్లలో ఎక్కువగా కనపడిన లక్షణం పొడి దగ్గు. మన దగ్గర కరోనా జ్వరాలు తక్కువ శాతమే. చైనాలో కరోనా పేషెంట్లలో ఎక్కువగా కనపడిన లక్షణం జ్వరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఏ దుకాణానికి వెళ్లినా.. షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా.. ఎయిర్‌పోర్టులకు వెళ్లినా/వేరే దేశాల నుంచి వచ్చినా.. థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా ఉష్ణోగ్రతను చెక్‌ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే అనుమానంతో వెనక్కి పంపేస్తున్నారు. కానీ.. ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు చేసిన పరిశోధనల ప్రకారం మార్చి-ఏప్రిల్‌ నెలల్లో మనదేశంలో కొవిడ్‌ బారిన పడినవారిలో కేవలం 17 శాతం మందికే జ్వరం వచ్చింది. మిగతావారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది. ఇతరత్రా లక్షణాలు కూడా లేకపోవడంతో (అసింప్టమాటిక్‌) వారు శుభ్రంగా ప్రజల మద్య తిరిగేశారు. అయితే.. జ్వరం, జలుబు, పొడిదగ్గు వంటి కొద్దిపాటి లక్షణాలు ఉండేవారికి లక్షణాల ఆధారంగా చేసే చికిత్సతో నయమైపోతోంది. కానీ, కొందరిలో మాత్రం వైరస్‌ ప్రాణాంతకంగా మారుతోంది. అప్పటిదాకా అంతా బాగున్నట్టే అనిపించినా.. కొన్ని గంటల వ్యవధిలోనే వారి ప్రాణాలు పోతున్నాయి.


అలాంటివారిలో ప్రధానంగా కనిపిస్తున్న లక్షణం.. ఊపిరి ఆడకపోవడం. మనదేశంలో ఇలాంటి కేసులు జూన్‌లో కొన్ని బయటపడ్డాయి. ఉదాహరణకు చెన్నైకు చెందిన ఒక వ్యక్తి (58)కి కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరాడు. 10 రోజులపాటు చికిత్స చేశాక.. లక్షణాలేవీ లేకపోవడంతో వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు. మర్నాడు ఆయన ఇంట్లో అన్నం తింటుండగా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గడం వల్లే ఊపిరి ఆడక చనిపోయారని వైద్యులు తెలిపారు. అప్పట్లో ముంబైలో కూడా కొందరిలో ఇలాగే జరిగింది.


చివరిదాకా తెలియదు..

సాధారణ జలుబు, సీజనల్‌ ఫ్లూ జ్వరాల వల్ల శ్వాస సమస్యలు రావు. కరోనా పేషెంట్లలో మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తున్న లక్షణం ఇది.. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది. చాలామంది అసింప్టమాటిక్‌ (ఎలాంటి లక్షణాలూ లేని) పేషెంట్లలో కొందరికి ఆక్సిజన్‌ స్థాయులు ప్రమాదకరస్థాయికి తగ్గిపోయేదాకా ఈ సమస్య బయటపడట్లేదు. అది వారి ప్రాణాలకే ముప్పు తెస్తోంది. ఉదాహరణకు.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి కొద్దిపాటి జ్వరం ఉంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో పొరుగింటి వ్యక్తి ఎందుకైనా మంచిదని పల్స్‌ ఆక్సీమీటర్‌ పెట్టి ఆయన ఆక్సిజన్‌ స్థాయులను చెక్‌ చేశారు. ఆక్సిజన్‌ స్థాయులు 80 శాతమే ఉండడంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి మర్నాటి ఉదయానికే మరణించారు! ఇలా శరీరంలో ఆక్సిజన్‌ స్థా యులు తగ్గిపోవడాన్ని హైపోక్సియా అంటారు. మా మూలుగా అయితే ఆక్సిజన్‌ స్థాయులు ఉండాల్సిన దానికన్నా కొద్దిగా తగ్గినా వెంటనే శ్వాస సమస్య వ స్తుంది. కానీ, కరోనా పేషెంట్లలో బాగా తగ్గేదాకా శ్వాస సమస్య రావట్లేదు. దీనివల్ల.. వారికి తమ సమస్య గురించి తెలిసేసరికే సమయం మించిపోతోంది. ఆస్పత్రిలో చేర్పించినా ఉపయోగం లేకపోతోంది (దీనినే సైలెంట్‌ హైపోక్సియాగా వ్యవహరిస్తున్నారు). కాబట్టి.. ఇంట్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ పరికరాన్ని ఉంచుకుని తరచుగా ఆక్సిజన్‌  స్థాయులను చెక్‌ చేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. అందులో ఆక్సిజన్‌ స్థాయులు 90ుకన్నా తగ్గినట్టు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నారు.


మరికొన్ని..

కరోనా పేషెంట్ల పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పే మరికొన్ని లక్షణాలు.. ఛాతీ బాగా నొప్పిగా/నొక్కిపెట్టినట్టుగా అనిపించడం, అయోమయానికి గురికావడం, ముఖం, పెదవులు నల్లగా అయిపోవడం. ఈ లక్షణాలు కనిపిస్తేగనుక వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.  మెదడుకు ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కొంతమందిలో స్ట్రోక్‌ సమస్య కూడా వస్తుంది. అలాంటిదేదైనా ఉంటే.. ముఖంలో ఒకవైపు మొద్దుబారిపోయినట్టుగా కావడం, ఒకవైపునకు కుంగిపోవడం, ఒక చెయ్యి బలహీనంగా లేదా మొద్దుబారినట్టుగా కావడం, ఆ చేతిని పైకెత్తలేని స్థితి రావడం, మాట ముద్దగా రావడం వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ స్పత్రికి తీసుకెళ్లాలి. తస్మాత్‌ జాగ్రత్త. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-07-27T07:54:31+05:30 IST