వైట్‌హౌస్‌లో కరోనా

ABN , First Publish Date - 2020-05-10T08:45:01+05:30 IST

అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సను కూడా తాకింది. అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలి...

వైట్‌హౌస్‌లో కరోనా

  • ఉపాధ్యక్షుడి మీడియా కార్యదర్శికి, ట్రంప్‌ కుమార్తె పీఏకూ పాజిటివ్‌
  • అధ్యక్ష భవనంలో మూడు కేసులు
  • కరోనా మృతులు 95 వేలు దాటొచ్చు
  • అందరికీ కరోనా పరీక్షలు అనవసరం
  • వ్యాక్సిన్‌ రాకముందే పోతుంది: ట్రంప్‌

వాషింగ్టన్‌, మే 9: అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సను కూడా తాకింది. అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలి(పీఏ)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇవాంకాకు సంబంధించిన టెలీ వర్కింగ్‌ విభాగంలో రెండు నెలలుగా ఈమె పనిచేస్తున్నారు. పీఏకు పాజిటివ్‌ రావడంతో ఇవాంక, ఆమె భర్త కుష్నర్‌ ఇద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మీడియా కార్యదర్శి కేటీ మిల్లర్‌కి పాజిటివ్‌ వచ్చింది. బుధవారం నాటి కరోనా పరీక్షల్లో ట్రంప్‌ భద్రతా సిబ్బంది ఒకరికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైట్‌హౌ్‌సలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఇక, శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేటీ మిల్లర్‌కు పాజిటివ్‌ వచ్చినట్టు ప్రకటించారు. ఆమె ఇటీవలే ఉపాధ్యక్షుడు పెన్స్‌తో భేటీ అయ్యారు. కాగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాన సలహాదారు స్టీఫెన్‌ మిల్లర్‌కు కేటీ సతీమణికావడంతో ఈ కుటుంబానికి కూడా కరోనా వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేటీ త్వరగానే కోలుకుంటుందని ట్రంప్‌ చెప్పారు.


మరోవైపు ట్రంప్‌ రక్షణ బాధ్యతలు చూస్తున్న మిలిటరీలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత రోజు పెన్స్‌ కార్యదర్శికి కూడా సోకడంతో వైట్‌హౌస్‌ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అందరినీ మాస్క్‌ ధరించాలని చెబుతున్నప్పటికీ.. అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు పెన్స్‌ మాస్క్‌లు ధరించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కాగా, కరోనా లెక్క లపై చైనా ఏదో దాస్తోందని విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో నిప్పులు చెరిగారు. వూహాన్‌ లేబొరేటరీ నుంచే వైరస్‌ పుట్టి ఉండొచ్చని అన్నారు. మరోవైపు ఓహియో రాష్ట్రంలో కరోనా మృత్యుఘోష పెరుగుతోంది. గత 3 వారాల్లో 500 మంది వైరస్‌తో చనిపోయారు. ఓ ఔషధాన్ని వినియోగించడం ద్వారా కొవిడ్‌-19 నుంచి ఉపశమనం పొందొచ్చంటూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రచారంతో బయోమెడికల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ రిక్‌ బ్రైట్‌ విభేదించారు. దీంతో ఆయనను తక్షణం బదిలీ చేశారు.  


భారతీయ అమెరికన్‌పై కేసు

భారతీయ అమెరికన్‌ వ్యాపారిపై కాలిఫోర్నియా పౌరసరఫరాల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. స్థానికంగా అప్నా బజార్‌ నిర్వహించే రాజ్‌విందర్‌ సింగ్‌.. కరోనా సమయంలో నిత్యావసరాలకు 200ు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీనిపై వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఆయనకు ఏడాదికి తగ్గకుండా జైలు శిక్ష లేదా 10 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-10T08:45:01+05:30 IST