కరోనా కవచ్.. యాంటీ వైరల్ టీషర్టు
ABN , First Publish Date - 2020-10-03T08:16:44+05:30 IST
యాంటీవైరల్ టీషర్టును, కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించే లోషన్‌ను అందుబాటు ధరల్లో అభివృద్ధి చేశాయి...

24 గంటలపాటు వైర్‌సల నుంచి రక్షణనిచ్చే లోషన్
ఐఐటీ ఢిల్లీ అనుబంధ స్టార్టప్‌ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 2: కరోనా దెబ్బకు చాలా మంది బయటికి వెళ్లి ఇంటికి రాగానే ఒంటి మీదున్న దుస్తులు తీసి శుభ్రంగా సర్ఫ్ నీళ్లల్లో నానబెడుతున్నారు. దుస్తులకేమైనా వైరస్ అంటుకుని ఉంటే పోతుందని ఆ జాగ్రత్త. కానీ, అదో పెద్ద పని. ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇ-టెక్స్, క్లెన్‌స్టా అనే రెండు స్టార్ట్‌పలు ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారంతో ముందుకొచ్చాయి. పొరపాటున వైరస్ పడినా అంటుకోని యాంటీవైరల్ టీషర్టును, కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించే లోషన్‌ను అందుబాటు ధరల్లో అభివృద్ధి చేశాయి. ఇ-టెక్స్ తయారు చేసిన ‘కవచ్ యాంటీ వైరల్ టీషర్ట్’, ‘కవచ్ మాస్క్’, క్లెన్‌స్టా తయారుచేసిన లోషన్, హ్యాండ్ శానిటైజర్ కలిసి ఉన్న ఒక కిట్‌ను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి.రామ్‌గోపాల్ రావు ఆవిష్కరించారు. ఐఐటీ ఢిల్లీలోని రసాయన శాస్త్ర, జౌళి విభాగాలకు చెందిన నిపుణులు వాటి తయారీలో ఆ రెండు సంస్థలకూ సహకరించారు. ఈ-టెక్స్ అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ టీషర్టు 30 ఉతుకుల తర్వాత కూడా ప్రభావాన్ని కోల్పోలేదని సమాచారం. ఇక, క్లెన్‌స్టా అభివృద్ధి చేసిన లోషన్‌లోని యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు 24 గంటల దాకా కరోనా వైరస్ నుంచి 99.9 శాతం రక్షణనిస్తాయని.. తద్వారా శానిటైజర్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ కుమార్ పేర్కొన్నారు. ఈ లోషన్‌ను చేతులు, కాళ్లు, ముఖానికి కూడా రాసుకోవచ్చని చెప్పారు. అలాగే క్లెన్‌స్టా హ్యాండ్ శానిటైజర్‌లోని ఆల్కహాల్ ప్రభావం ఎక్కువసేపు ఉండి రకరకాల వైర్‌సల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు.