ఐరోపాలో కరోనా తగ్గుముఖం
ABN , First Publish Date - 2020-06-16T07:58:51+05:30 IST
కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిన ఐరోపాలో వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొవిడ్-19 కారణంగా మూడు నెలలుగా లాక్‌డౌన్‌లోనే ఉన్న యూర్‌పలోని అనేక దేశాలు సోమవారం సరిహద్దులను తెరిచాయి...

- సరిహద్దులు తెరిచిన పలు దేశాలు
- బ్రిటన్‌లోనూ వ్యాపారాలు మొదలు
- అమెరికా, బ్రెజిల్‌లో తగ్గని ఉధృతి
బెర్లిన్, జూన్ 15: కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిన ఐరోపాలో వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొవిడ్-19 కారణంగా మూడు నెలలుగా లాక్‌డౌన్‌లోనే ఉన్న యూర్‌పలోని అనేక దేశాలు సోమవారం సరిహద్దులను తెరిచాయి. అయితే కరోనా విజృంభించే అవకాశాలు ఉండడంతో తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాల నుంచి పర్యాటకులను అనుమతివ్వడం లేదు.
ఇటలీలో రెండు వారాల క్రితమే బోర్డర్లు తెరుచుకోగా.. జర్మనీ, ఫ్రాన్స్‌లో సోమవారం నుంచి సరిహద్దుల వద్ద తనిఖీలను ఆపివేశారు. తమ దేశ సరిహద్దులు తెరిచామని, పారి్‌సలోనూ రెస్టారెంట్లకు అనుమతినిచ్చామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ ప్రకటించారు. సోమవారం గ్రీస్ కూడా తొలి అంతర్జాతీయ విమానానికి స్వాగతం పలికింది. కాగా.. నార్వే, డెన్మార్క్ మాత్రం ఇంకా సరిహద్దులు సరిహద్దులు తెరవలేదు. బ్రిటన్‌లో సోమవారం నుంచి అన్ని రకాల వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ఇకనుంచి ప్రజలు షాపింగ్ చేసుకోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కాగా.. దేశంలో ప్రతి ఒక్కరూ 2 మీటర్ల భౌతిక దూరం (6.5అడుగులు) పాటించాలన్న నిబంధనను సమీక్షిస్తున్నామని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
బీజింగ్‌లో సామూహిక పరీక్షలు
చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నట్టుండి కేసుల అలజడి పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బీజింగ్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లిన వారికి సామూహిక పరీక్షలు నిర్వహిస్తోంది. చైనాలో కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. వాటిలో 42 బీజింగ్‌లోనే ఉన్నాయి. దీంతో మే 30 నుంచి జిన్‌ఫాది హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చిన 29 వేల మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా.. అమెరికా, బ్రెజిల్, రష్యాలో కేసుల ఉధృతి తగ్గడం లేదు. 24 గంటల్లో అమెరికాలో 20,004 కేసులు, బ్రెజిల్‌లో 17,086, రష్యాలో 8,246 కేసులు వెలుగుచూశాయి. సింగపూర్‌లో మరో 214 మందికి వైరస్ సోకింది. దక్షిణ కొరియాలో కొత్తగా 37 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసులు 12,121కి చేరాయి. పాకిస్థాన్‌లో కొత్తగా 5,248 మందికి పాజిటివ్ తేలగా, 97 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 1,44,676కి చేరగా, మృతుల సంఖ్య 2,729కి చేరింది.