కరోనా కట్టడికి ‘ర్యాపిడ్’ టెస్టులు
ABN , First Publish Date - 2020-04-05T07:43:29+05:30 IST
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలు(హాట్‌స్పాట్‌లు)...

హాట్‌స్పాట్‌లు, వలస ప్రజల ఆవాసకేంద్రాలే టార్గెట్
ఫ్లూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలు
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలు(హాట్‌స్పాట్‌లు), వలస వచ్చిన ప్రజల తాత్కాలిక ఆవాసానికి ఏర్పాటుచేసిన కేంద్రాలను లక్ష్యంగా ఎంచుకోవాలని సంకల్పించింది. ఫ్లూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహించడం ద్వారా కరోనా వ్యాప్తిని మొగ్గదశలోనే తుంచివేయాలని భావిస్తోంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్) శనివారం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీచేసింది. ఆ వివరాలివీ..
హాట్‌స్పాట్‌లలో నివసించే ప్రజలకు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉంటే 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.
ఫ్లూ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు నిర్వహిస్తారు. ప్రతిరక్షకాల సంఖ్య శరీరంలో సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే పాజిటివ్‌గా తేల్చి తదుపరి వైద్యపరీక్షల తర్వాత ఆస్పత్రికి తరలిస్తారు.
ఒకవేళ యాంటీబాడీ టెస్టులో నెగెటివ్ వస్తే ముక్కు, గొంతు స్రావాలు సేకరించి ఆర్‌టీ-పీసీఆర్(పాలిమరేజ్ చైన్ రియాక్షన్) పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాజిటివ్ వస్తే మాత్రం కరోనా రోగిగా గుర్తించి, ఐసోలేషన్‌కు తరలించి తగిన చికిత్స అందిస్తారు. సదరు రోగి సంబంధీకులు, సన్నిహితులనూ గుర్తించి వైద్యం అందిస్తారు.
ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులో నెగెటివ్ రావడంతో పీసీఆర్ పరీక్ష చేయని వారికి హోం క్వారంటైన్‌లో ఉండమని సూచన ఇస్తారు. మళ్లీ 10 రోజుల తర్వాత యాంటీబాడీ టెస్టు నిర్వహించి పాజిటివ్ అని తేలితే ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు. నెగెటివ్ అని తేలితే కరోనా లేదని నిర్ధారిస్తారు.
ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందే కరోనా పాజిటివ్ రోగుల పరిస్థితి విషమిస్తే ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన కొవిడ్-19 ప్రత్యేక ఆస్పత్రులకు తరలిస్తారు.
ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహించే క్రమంలో పాజిటివ్ కేసులు భారీగా ఉన్నట్లు తేలితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.