పాజిటివ్ లక్షణాలున్న మహిళకు పండంటి బిడ్డ
ABN , First Publish Date - 2020-04-05T05:54:26+05:30 IST
కరోనా కారణంగా సమాజంలో నెలకొన్న భయాందోళనల మధ్య పాజిటివ్ లక్షణాలున్న ఒక మహిళ ఆరోగ్యకరమైన మగ బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలోని...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కరోనా కారణంగా సమాజంలో నెలకొన్న భయాందోళనల మధ్య పాజిటివ్ లక్షణాలున్న ఒక మహిళ ఆరోగ్యకరమైన మగ బిడ్డను ప్రసవించింది. ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. ఎయిమ్స్‌లో ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్‌లో కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఒక రెసిడెంట్ డాక్టర్‌కు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. రిపోర్టు అందిన కొన్ని గంటల్లోనే ఆ డాక్టరు భార్యను కూడా పరీక్షించారు. ఆమెకు కూడా పాజిటివ్ అనే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటికే ఆమె నిండు గర్భవతి. పైగా ప్రసవ సమయం కూడా అయి ఉండటం డాక్టర్లకు ఆందోళన కలిగించింది. దాంతో ఎయిమ్స్ డాక్టర్లు ఆమెను వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కొవిడ్-19 క్లినికల్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాల మేరకు తాత్కాలిక ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ నీరజ బృందం ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, శిశువు ఇద్దరిని క్వారంటైన్‌లో ఉంచారు. ఆ శిశువు ఆరోగ్యవంతంగా ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. ప్రసవం అనంతరం నవజాత శిశువుకు తల్లి పాలు ఇవ్వొచ్చని డాక్టరు సూచించారు. చనుబాల ద్వారా కొవిడ్ ఇన్ఫెక్షన్ సంక్రమించదని వారు తెలిపారు. భారతదేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో పాజిటివ్ లక్షణాలున్న దంపతులకు ఆరోగ్యకరమైన శిశువు జన్మించిడం ఇదే తొలిసారి.