కరోనా సోకిన తల్లి తన మూడు రోజుల బిడ్డను ఆసుపత్రిలోనే వదిలివేసి...
ABN , First Publish Date - 2020-08-16T15:11:31+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలోని బడా హిందూరావ్ ఆసుపత్రిలో హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిన ఒక మహిళ తన మూడు రోజుల బిడ్డను ఆసుపత్రిలో వదిలివేసి, పరారయ్యింది.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని బడా హిందూరావ్ ఆసుపత్రిలో హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిన ఒక మహిళ తన మూడు రోజుల బిడ్డను ఆసుపత్రిలో వదిలివేసి, పరారయ్యింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సబ్జీ మండీ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రితో సహా సమీప ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక గర్భిణీని డెలివరీ కోసం కస్తూర్బా గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా, పాజిటివ్ రిపోర్టు వచ్చింది. తరువాత తల్లి, కుమార్తెలను బడా హిందూరావ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నవజాత శిశువును నర్సరీలో ఉంచి, ఆ మహిళను కరోనా వార్డుకు తరలించారు. ఇంతలో ఆ మహిళ తన బిడ్డను ఆసుపత్రిలోనే వదిలివేసి పరారయ్యింది. ఇది తెలియగానే ఆసుపత్రిలో కలకలం చెలేరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళ కోసం గాలింపు చేపట్టారు. కాగా ఆమె ఆసుపత్రిలో చేరే సమయంలో బీహార్‌లోని ఔరంగాబాద్‌లో తాను ఉంటున్నట్లు తెలిపింది.