భారత్‌లో మరో ముగ్గురు బలి
ABN , First Publish Date - 2020-03-23T06:21:19+05:30 IST
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 396కి చేరింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు 81 మందికి పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ..

- దేశంలో ఏడుకు చేరిన కరోనా మృతులు
- 396కి చేరిన పాజిటివ్ కేసులు
- ఒక్కరోజే 81 కొత్త కేసులు
- ఢిల్లీలో స్థానికంగా ఆరుగురికి కొవిడ్
న్యూఢిల్లీ, మార్చి 22: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 396కి చేరింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు 81 మందికి పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య ఏడుకు చేరింది. వారిలో ఇద్దరు మహారాష్ట్రవాసులే. వైరస్ బారిన పడిన 63 ఏళ్ల వృద్ధుడు ముంబైలో మరణించాడు. ఇంతవరకూ దేశంలో అత్యధికంగా 74 కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఒక్క ఆదివారం నాడే 10 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది.
అందులో ఆరుగురు ముంబైవాసులు కాగా.. నలుగురు పుణె వాసులు. పుణెలో వైరస్ బారినపడ్డ మహిళ (41) కుటుంబంలో నలుగురికి ఆమె నుంచి వైరస్ సోకింది. విదేశాలకు వెళ్లొచ్చినవారి ద్వారా ఆమెకు వైరస్ సోకడం గమనార్హం. గుజరాత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. సూరత్‌కు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు వైరస్ బారినపడి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. ఇప్పటిదాకా రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైన బిహార్‌లో ఒకరు (38) మరణించారు. ఖతర్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి నమూనాలను శుక్రవారంనాడు వైద్యపరీక్షకు పంపారు. శనివారం రాత్రి అతడు చనిపోగా.. వైద్యపరీక్ష ఫలితాలు ఆదివారం వచ్చాయి. అతడికి వైరస్ సోకినట్టు అందులో తేలింది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. స్పెయిన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి వైరస్ సోకినట్టు అధికారులు ధ్రువీకరించారు. భోపాల్‌లో కూడా.. ఇటీవలే లండన్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని వైరస్ బారిన పడింది. యూపీలో కరోనా బారిన పడిన భారత సంతతి కెనడా మహిళకు పూర్తిగా నయమైంది. ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా వైరస్ బారిన పడినవారి సంఖ్య 25. కేరళలో 52, ఢిల్లీలో 27, రాజస్థాన్‌లో 24, కర్ణాటకలో 21, హరియాణాలో 17, పంజాబ్‌లో 13, లద్దాఖ్‌లో 13 కేసులు నమోదయ్యాయి.
పసుపు సంచీల్లోనే కరోనా బయో వేస్ట్
కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స, క్వారంటైన్లు, ఐసోలేషన్ల నుంచి వెలువడే బయో వేస్ట్ నిర్వహణకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా బయో వేస్ట్‌ను పసుపు రంగు సంచీల ద్వారా తరలించాలని సూచించింది. ఆ సంచీలు రెండు పొరలు (లేదా రెండు సంచిలు కలిపి) ఉండాలని పేర్కొంది. కరోనా బయోవేస్ట్ బిన్‌లు కూడా పసుపు రంగులోనే ఉండాలని ఆదేశించింది.