కరోనా కల్లోలం సాగుతుండగానే.. పలు సంఘటనలు!

ABN , First Publish Date - 2020-12-31T04:46:03+05:30 IST

ఓవైపు కరోనా కల్లోలం సాగుతుండగానే.. లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన పలు సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. రోజుల తరబడి మీడియాలో మెయిన్‌ ఇష్యూస్‌ అయ్యాయి...

కరోనా కల్లోలం సాగుతుండగానే..  పలు సంఘటనలు!

ఓవైపు కరోనా కల్లోలం సాగుతుండగానే.. లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన పలు సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. రోజుల తరబడి మీడియాలో మెయిన్‌ ఇష్యూస్‌ అయ్యాయి. రాజకీయంగానూ కలకలం సృష్టించాయి. రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చాయి. 


ఆత్మహత్య కేసు అనుకోని మలుపులు తిరిగింది. విచారణలో నివ్వెరపోయే నిజాలు బయట పడ్డాయి. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటన కొద్ది నెలల పాటు జాతీయ స్థాయిలో ప్రధానాంశం అయ్యింది. అంతేకాదు.. కేసు విచారణ సాగుతున్న క్రమంలో మొత్తం బాలీవుడ్‌నే కుదిపేసింది. ఆత్మహత్య కేసును విచారిస్తే డ్రగ్స్‌ డొంకలు కదిలాయి. ఈ రెండు కేసుల్లో విచారణ కొన్నాళ్ల పాటు.. రోజు రోజుకూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మిస్టరీ సినిమాను తలపించింది. 


కేసు విచారణ సాగుతున్న క్రమంలో ఇది రెండు రాష్ట్రాల మధ్య విమర్శలు, విద్వేషాలకు కారణమయ్యింది. బిహార్‌, మహారాష్ట్ర పోలీసుల మధ్య వివాదం రేపింది. ఓ దశలో కరోనా కంటే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం పైనే మీడియా ఫోకస్ చేసింది. ఈ యేడాది కరోనా తర్వాత ఇంత ఉధృతంగా చర్చ జరిగిన అంశం మరొకటి లేదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసును ఆత్మహత్యగా పోస్టుమార్టం రిపోర్ట్‌లో నిర్ధారించారు. ముంబై పోలీసులు తొలుత ఆకోణంలోనే విచారణ సాగించారు. అయితే.. సీబీఐ ఎంటరయ్యాకనే ఈ కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. కానీ, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం.. ఆత్మ హత్యా, హత్యా అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే వుంది.


ఈ కేసు అనూహ్యంగా డ్రగ్స్‌ వైపు టర్న్‌ తీసుకున్నాక.. అసలు విషయం కన్నా.. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం అనే అంశమే హైలైట్‌ అవుతోంది. సుశాంత్‌ ఆత్మహత్య అనే అసలు విషయం దాదాపు మరుగున పడిపోయింది. బాలీవుడ్‌ స్టార్ల ప్రమేయం ఉన్నట్లు కూడా లీకులు వచ్చాయి. డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తు సాగిస్తున్న ఎన్‌సీబీ ఇందులో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న పలువురిని అరెస్టు చేసింది. సుశాంత్‌ సింగ్‌ ప్రియురాలు రియా చక్రబర్తి కూడా డేంజర్‌జోన్‌లోకి వెళ్లింది. సుశాంత్ కేసు కంటే కూడా ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు ఎక్కువగా చుట్టు ముట్టాయి. 


ఈయేడాది జూన్‌ 14 వ తేదీన సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాడు. ఆరు నెలలు గడిచి పోయింది. తొలుత ముంబై పోలీసులు విచారణ సాగించిన ఈ కేసులో ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశంతో సీబీఐ ఎంటరయ్యింది. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు సాగిస్తోంది. మరోవైపు,  డ్రగ్స్‌ కోణంలో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో దర్యాప్తు చేస్తోంది. అంతేకాదు.. ఆ తర్వాత ఈ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆధారాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ - ఈడీ కూడా ఎంటరయ్యింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖలను ఎన్‌సీబీ విచారించింది. 


మరోవైపు.. దేశంలో మరో సమస్య లేనట్టుగా మీడియా దృష్టి మొత్తం రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యుల విచారణపైనే పెట్టిందంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాపై సెటైర్లు వేశారు. ఇదే వ్యవహారంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మధ్య ట్విట్టర్‌ యుద్ధానికి కారణమయ్యింది. చివరకు ఈ వ్యవహారం కంగనా వర్సెస్‌ శివసేనగా మారిపోయింది. మహారాష్ట్ర సర్కారు ఆమె ఇంటి ప్రహారీని కూల్చేందుకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్లు కూడా సంచలనం సృష్టించాయి. 


 ఇటు దక్షిణాదిలోనూ శాండల్‌వుడ్‌లో మాదక ద్రవ్యాల వ్యవహారం బయటపడింది. కన్నడ సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు  అధికారులకు ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. ఇక.. ఇటు టాలీవుడ్‌నూ డ్రగ్‌ వ్యవహారం వెంటాడుతోంది. ముఖ్యంగా నటి మాధవీలత ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన పోస్ట్‌ కలకలం సృష్టించింది. టాలీవుడ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడతారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాధవీలత ఫేస్‌బుక్‌ వేదికగా కోరారు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌  ట్విట్టర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఓ రేంజ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై పోస్ట్‌లు పెట్టి సంచలనం సృష్టించారు. దీంతో.. మాధవీలతను టాలీవుడ్‌ కంగనా రనౌత్‌ అని కొందరు అభివర్ణించారు.


అటు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19యేళ్ల యువతిపై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేసింది. నిర్భయ తరహాలో సాగిన అరాచకం రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. తల్లితో పాటు పొలానికి వెళ్లిన యువతిని కొందరు దుర్మార్గులు దూరంగా లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. అరిచేందుకు ప్రయత్నించిన ఆ యువతి నాలుక కోసేశారు. చున్నీతో మెడకు బిగించి హత్యాయత్నం చేశారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోయాయి. అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. చేతులు కూడా పాక్షికంగా చచ్చుబడి పోయాయి.


సెప్టెంబర్‌ 14వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదేనెల 29వ తేదీన యువతి చనిపోయింది. కన్న కూతురు కామాంధుల చెరలో పడి నలిగిపోయిందన్న బాధే ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేసింది. చికిత్స పొందుతూ తమ కూతురు చనిపోయిందన్న బాధ క్షోభకు గురిచేసింది. కానీ, చివరి చూపులు కూడా లేకుండా చేశారు పోలీసులు. ఉద్రిక్తత నెలకొంటుందనే కారణంతో అర్థరాత్రి దాటాక రెండున్నర గంటల సమయంలో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం ఆమె ఇంటికి కూడా తీసుకెళ్లకుండా మృతదేహాన్ని నేరుగా స్మశానానికి తీసుకెళ్లి పోలీసులే ఖననం చేశారు. అది కూడా తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు తెలియకుండా పోలీసు వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు. ఆ పరిణామం అమ్మాయి తల్లిదండ్రులనే కాదు.. అమ్మాయిలున్న తల్లిదండ్రులందరి గుండెలనూ మెలిపెట్టింది. 


హత్రాస్‌ గ్యాంగ్ రేప్ బాధితురాలి మరణంతో విపక్షాలు భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. యూపీ సర్కారు వైఫల్యం, నిర్లక్ష్యంపై విపక్షాలు కన్నెర్రజేశాయి. యూపీ రేపిస్టు క్యాపిటల్‌గా మారిందంటూ ప్రజాసంఘాలు, విపక్షాలు ఆరోపించాయి. ఈ పరిణామంతో కొద్దిరోజుల పాటు హత్రాస్‌ను మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఎవరినీ ఆ గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు జాతీయ రహదారిని మొత్తం దిగ్బంధించారు. హత్రాస్‌ వెళ్లేందుకు బయలుదేరిన కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలలను అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పోలీసుల తోపులాటలో రాహుల్‌ కిందపడ్డారు. రెండు రోజుల తర్వాత వాళ్లిద్దరితో పాటు.. మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో రాహుల్‌, ప్రియాంక హత్రాస్‌ వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు.


హత్రాస్‌ దుర్ఘటన అనంతర పరిణామాలపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, ప్రభుత్వం వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అటు.. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కన్నెర్ర చేసింది. ఈ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. మరోవైపు.. జాతీయ మహిళా కమిషన్‌ కూడా జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్‌ డీజీపీని ప్రశ్నించింది.


కేరళలో ప్రకంపనలు సృష్టించిన, పార్లమెంటులోనూ చర్చను లేవనెత్తిన సంచలన హత్యకేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 28 సంవత్సరాల తర్వాత తీర్పుచెప్పింది. ఇద్దరిని దోషులుగా నిర్ధారించి జీవితఖైదు విధించింది. ఈ తీర్పు జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది.


1992 మార్చి 27 వతేదీన కేరళలోని కొట్టాయంలోఉన్న సెంట్‌ పీయూస్‌ కాన్వెంట్‌ ఆవరణలోని బావిలో ఓ మృతదేహం కనిపించింది. చనిపోయిన అమ్మాయి 21 సంవత్సరాల సిస్టర్‌ అభయ. క్రైస్తవ కాన్వెంట్‌లో ఉండి చదువుకుంటోంది. ఆ కేసును మొదట కొట్టాయం పోలీసులు దర్యాప్తు చేశారు. తర్వాత కేరళ సీఐడీ దర్యాప్తు సాగించింది. యేడాది తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ 16 సంవత్సరాలపాటు సుదీర్ఘవిచారణ సాగించింది. 13 మంది దర్యాప్తు అధికారులు మారారు. ఆత్మహత్యగా ఈ కేసును మూసేయడానికి 16 సంవత్సరాల కాలంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ, చివరకు సీబీఐ అసలు దోషులను, ఆధారాలను కోర్టుముందు ప్రవేశపెట్టింది. కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ సాగిన తర్వాత ఈనెల 23వ తేదీన దోషులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. 


పోలీసులు, రాజకీయ నాయకులు, మత పెద్దలు మూకుమ్మడిగా ఓ హత్యకేసు ఆధారాలను మాయం చేసి నిందితులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలకు సాక్ష్యంగా సిస్టర్‌ అభయ కేసు నిలిచింది. విచారణలో వెల్లడైన విషయాలను బయట పెట్టేందుకు సీబీఐ ప్రయత్నించినా.. దాదాపు రెండు దశాబ్దాలపాటు.. ఆ వాస్తవాలు బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు పటాపంచలయ్యాయి. అవినీతి, అక్రమాలు అథ: పాతాళానికి తొక్కేయబడ్డాయి. నిప్పులాంటి నిజం ఎట్టకేలకు దర్జాగా బయటకు వచ్చింది. సిస్టర్‌ అభయ హత్యకేసు మిస్టరీని సీబీఐ ఛేదించింది. దోషులెవరో బట్టబయలు చేసింది.


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన, ప్రత్యేక చట్టం తేవడానికి కారణమైన నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలయ్యింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం తీహార్ జైలులో ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలను ఉరి తీశారు. నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలుచేయడం తీహార్ జైలులో ఇదే మొదటిసారి. దుర్ఘటన జరిగిన ఏడేళ్ల మూడు నెలల 4 రోజుల తర్వాత దోషులకు శిక్ష అమలయ్యింది.


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-12-31T04:46:03+05:30 IST