రోగుల మధ్యే శవాలు

ABN , First Publish Date - 2020-05-08T07:49:42+05:30 IST

అది ముంబైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రి.. అందులో కరోనా వైరస్‌ రోగుల వార్డు.. మంచాలపై కొందరు రోగులు.. ఆ వార్డులోనే.. వారి మధ్యనే.. మంచాలు, స్ట్రెచర్లపై కరోనాతో చనిపోయినవారి...

రోగుల మధ్యే శవాలు

  • ముంబై ఆస్పత్రి కరోనా వార్డులో  భీతావహ దృశ్యం.. వీడియో వైరల్‌
  • దేశంలో మరో 89 మంది మృతి
  • కేసులు 54,610.. మృతులు 1,783

ముంబై/న్యూఢిల్లీ, మే 7: అది ముంబైలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రి.. అందులో కరోనా వైరస్‌ రోగుల వార్డు.. మంచాలపై కొందరు రోగులు.. ఆ వార్డులోనే.. వారి మధ్యనే.. మంచాలు, స్ట్రెచర్లపై కరోనాతో చనిపోయినవారి మృతదేహాలు! నలుపురంగు షీట్లు చుట్టేసి ఉన్నాయి! పట్టించుకొనే వారు లేక, మార్చురీకైనా తరలించక అనాథ శవాల్లా పడి ఉన్న వాటి మధ్యే బిక్కుబిక్కుమంటూ ఇతర రోగులు! ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు ఉన్న వీడియో కలకలం సృష్టించింది. ఇది బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఆధ్వర్యంలో నడిచే సాయన్‌ ఆస్పత్రిలో దారుణ పరిస్థితి. కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి బంధువులు రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆస్పత్రి డీన్‌ డాక్టర్‌ ప్రమోద్‌ ఇంగ్లే వివరణ ఇచ్చారు. మృతదేహాలను మార్చురీకి ఎందుకు తరలించలేదని ప్రశ్నించగా ‘‘ఆస్పత్రిలోని మార్చురీలో 15 మృతదేహాలను భద్రపరచడానికే చోటుంది. అందులో 11స్లాట్లలో ఇప్పటికే మృతదేహాలు ఉన్నాయి. మిగతా వాటిని కూడా తరలిస్తే కరోనాతో కాకుండా ఇతర రోగాలతో చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరచడానికి ఖాళీ ఉండదు’’ అన్నారు. ప్రస్తుతం మృతదేహాలను తరలించామని చెప్పారు. ఈ వీడియోలో నిజమెంతో తేల్చడానికి దర్యాప్తునకు డీన్‌ ఆదేశించారని గురువారం సాయంత్రం బీఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా తీవ్రంగా ఉన్న అతి పెద్ద మురికివాడ ధారావికి చెందిన రోగులను ఈ ఆస్పత్రికి తరలిస్తుంటారు. గురువారం ఈ ప్రాంతంలో కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య 783కు పెరిగింది. 


దేశంలో మూడో రోజూ 3 వేలకు పైనే

భారత్‌లో వరుసగా మూడో రోజూ 3,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ ముంబై, అహ్మదాబాద్‌, చెన్నై, ఢిల్లీ నగరాలవే. కరోనా సోకిన ఇద్దరు బీఎ్‌సఎఫ్‌ సిబ్బంది, సీఐఎ్‌సఎఫ్‌ అధికారి ఒకరు మృతిచెందారు. కేంద్ర సాయుధ బలగాల్లో 500మంది కరోనాతో బాధపడుతున్నారు. మహారాష్ట్రలో 1,216 కొత్త కేసులతో మొత్తం 17,974కి పెరిగాయి. ముంబైలో మరో 692 కేసులతో 11,219కి చేరాయి. గుజరాత్‌లో కొత్తగా నమోదైన 388 కేసుల్లో 275 అహ్మదాబాద్‌వే. తాజా కేసులతో మొత్తం కేసులు గుజరాత్‌లో 7,013కు, అహ్మదాబాద్‌లో 4,991కు చేరాయి. తమిళనాడులో మరో 580 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 316 మంది చెన్నై వాసులు. తమిళనాట కేసులు 5,409కి, చెన్నైలో 2,644కి చేరుకున్నాయి. కొత్త కేసులన్నీ కోయంబేడు క్లస్టర్‌కి సంబంధించినవే. కర్ణాటకలో మరో 12 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దావణగెరెలో 55 ఏళ్ల మహిళ చికిత్స పొం దుతూ మృతిచెందింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. దేశంలో గత 24 గంట ల్లో 89 మంది కరోనా రోగులు మృతిచెందారు. కొత్తగా 3,561 మందికి వైరస్‌ సోకింది. గురువారం రాత్రి 9.30 గంటలకు వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగి 5 వేలు దాటింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,783కు, కేసులు 54,610కు పెరిగాయి. ఇప్పటి వరకు 15,266 మంది(28.83ు) కోలుకున్నారని ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘‘యాక్టివ్‌ కేసులు 6.6ు చొప్పున పెరుగుతున్నాయి. ఈ లెక్కన కేసులు రెట్టింపు కావడానికి 11 రోజులు పడుతోంది’’ అని ప్రధాని ఆర్థిక సలహాదారుల మండలి మాజీ సభ్యురాలు షమిక రవి తెలిపారు. 10 లక్షల జనాభా పరిమాణంగా చూస్తే గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వల్ల జాతీయ సగటు మరణాల రేటు పెరుగుతోందని విశ్లేషించారు. కేరళ, ఒడిసా, జమ్మూకశ్మీర్‌ సహా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. 


మూడో వంతు కేసులు 6 రోజుల్లోనే 

ఢిల్లీలో కరోనా వ్యాప్తి కలవరపెడుతోంది. మూడో వంతు కేసులు గత 6రోజుల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా బుధవారం 428, ఈనెల 3న 427 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5,532కు చేరాయి. ఇందులో 2,017 కేసులు ఈ నెల 1 నుంచి 6వ తేదీ లోపు నమోదైనవే. మహారాష్ట్రలో 487మంది పోలీసులకు కరోనా సోకింది. యూపీలోని ఒక మసీదు నుంచి 24 మంది తబ్లీగీ సభ్యులను అరెస్టు చేశారు.


Updated Date - 2020-05-08T07:49:42+05:30 IST