మరో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2020-03-08T07:58:22+05:30 IST

దేశంలో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. ఇందులో ఇద్దరు లద్దాఖ్‌లో ఉన్నవారు కాగా ఒకరు తమిళనాడు వాసి. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 34కు పెరిగింది. లద్దాఖ్‌లో ఇద్దరికీ ఇరాన్‌కు వెళ్లి రావడం వల్ల సోకినది...

మరో ముగ్గురికి కరోనా

లద్దాఖ్‌లో ఇద్దరు, తమిళనాట ఒకరు

పంజాబ్‌లో ఇద్దరికి పాజిటివ్‌ ?

దేశంలో 52 టెస్టింగ్‌ ల్యాబ్‌లు సిద్ధం

తెలంగాణలో గాంధీ మెడికల్‌ కాలేజి

ఏపీలో 3 చోట్ల సెంటర్లు

వదంతులొద్దన్న ప్రధాని మోదీ

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్‌ ల్యాబ్‌లు 


న్యూఢిల్లీ, మార్చి 7: దేశంలో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. ఇందులో ఇద్దరు లద్దాఖ్‌లో ఉన్నవారు కాగా ఒకరు తమిళనాడు వాసి. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య 34కు పెరిగింది. లద్దాఖ్‌లో ఇద్దరికీ ఇరాన్‌కు వెళ్లి రావడం వల్ల సోకినది కాగా తమిళనాడు వాసికి ఒమాన్‌ వెళ్లడం వల్ల వచ్చినది. వీరు ముగ్గురితో పాటు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైరస్‌ ప్రబలంగా ఉన్న ఇటలీ వెళ్లి వీరు కొద్దిరోజుల కిందటే తిరిగివచ్చారు. జమ్మూ కశ్మీర్లోనూ రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇద్దరికి వైరస్‌ లక్షణాలున్నట్లు భావించి ప్రత్యేక వార్డులో పెట్టగా వారు చెప్పా పెట్టకుండా బయటకు  వెళ్లిపోయారు. అతి కష్టంమీద వారిని తిరిగి తీసుకురావలసి వచ్చింది. వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరగుతుండడంతో అత్యవసరంగా దేశవ్యాప్తంగా 52 పరీక్షా  ప్రయోగశాలలను కేంద్రం సిద్ధం చేసింది.  వీటిలో రెండు ఢిల్లీలో కాగా- మిగిలినవి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటిదాకా 3404 మంది తాలూకు రక్త నమూనాలను, దేహ విసర్జితాలను పరీక్షించినట్లు వెల్లడించింది. తెలంగాణలోని గాంధీ మెడికల్‌ కాలేజి, ఆంధ్రప్రదేశ్‌లో స్విమ్స్‌-తిరుపతి, ఆంధ్రా మెడికల్‌ కాలేజి- విశాఖ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ-అనంతపురాల్లో ఈ టెస్టింగ్‌ ల్యాబ్‌లను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా భారీ జనసమూహాలతో సమావేశాలేవీ ఏర్పాటు చేయవద్దని కేంద్రం రాష్ట్రాలను కోరింది. 

Updated Date - 2020-03-08T07:58:22+05:30 IST