సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ఆపాలి

ABN , First Publish Date - 2020-04-08T07:27:16+05:30 IST

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో రూ. 20 వేల కోట్లతో ఢిల్లీ నడిబొడ్డున చేపట్టదల్చిన సెంట్రల్‌ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను నిలిపేయాలని, ఆ నిధులతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ఆపాలి

ఆ 20 వేల కోట్లూ వైద్య సదుపాయాలకు ..  

విదేశీ పర్యటనలు వద్దు.. ప్రకటనలూ రద్దు

ఐదు సూచనలతో మోదీకి సోనియా లేఖ

సెంట్రల్‌ విస్టాపై విపక్షాలన్నింటిదీ అదే మాట


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో రూ. 20 వేల కోట్లతో ఢిల్లీ నడిబొడ్డున చేపట్టదల్చిన సెంట్రల్‌ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను నిలిపేయాలని, ఆ నిధులతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమున్న చారిత్రక భవనంలో పార్లమెంటు కార్యకలాపాలను సౌకర్యవంతంగా సాగించవచ్చని అభిప్రాయపడ్డారు. సంక్షోభ కాలం ముగిసే వరకూ ఈ విలాసాలు అవసరం లేదనీ  ఆమె ప్రధానికి రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు.


కొవిడ్‌-19పై పోరుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని ఫోన్‌ చేయడంతో ఆమె ఈ లేఖ పంపారు. పార్లమెంట్‌ భవనం, రాష్ట్రపతి భవనం, రాజ్‌పథ్‌, ఇండియాగేట్‌ వరకూ ఉన్న 3.5 హెక్టార్ల స్థలం రూపురేఖలు మార్చాలన్న ప్రణాళికే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు. దీనికి రూ.20,000  కోట్ల నుంచి రూ.25,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మొహువా మైత్రే, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే నేతలూ ఈ ప్రాజెక్టు ఆపాలని సూచించారు. ఇది వాయిదా వెయ్యదగ్గ లగ్జరీ అని శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. 


సోనియా చేసిన మరో సూచన... రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలపై నిషేధం. ఒక్క కరోనాపై చైతన్యానికి సంబంధించిన యాడ్స్‌ తప్ప మిగిలినవన్నీ నిలిపేయాలన్నారు. ప్రస్తుతం ఏటా రూ 1250 కోట్లు కేవలం కేంద్ర సర్కారే ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను నిలిపివేయాలని, ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో, జాతీయ ప్రయోజనాలకు  సంబంధించిన పర్యటనలకే అనుమతివ్వాలని సోనియా ప్రతిపాదించారు. ఒక్క ప్రధాని ఖాతా కింద ఏటా విదేశీయానాలకు రూ.400 కోట్ల మేర ఖర్చవుతోంది. మరో సూచన ఏంటంటే.. 


కరోనా సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ నిధిలో జమ  అయిన మొత్తాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి బదిలీ చేయాలని, దీని వల్ల నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయని పేర్కొన్నారు. ఒకే ఉద్దేశానికి రెండు వేర్వేరు నిధులు వృఽథా అని అభిప్రాయపడ్డారు. 2019 - 20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రధాని సహాయనిధిలో రూ.3800 కోట్లు ఉన్నాయని, వాటికి పీఎం కేర్స్‌ నిధులను కలిపి అణగారిన. పేదల ఆహార భద్రతకు వినియోగించుకోవచ్చని సోనియా అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలను మినహాయించి వ్యయ బడ్జెట్‌లో 30 శాతం తగ్గించాలని, దాంతో ఆదా అయ్యే రూ. 2.5 లక్షల కోట్లతో వలస కార్మికులు, కార్మికులు, రైతులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక భద్రత కల్పించాలని సూచించారు.


ఎంపీల జీతభత్యాల్లో 30 శాతం కోత, రెండేళ్ల పాటు ఎంపీల్యాడ్స్‌ నిధుల నిలిపివేతను సోనియా స్వాగతించారు. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ప్రతీ ఒక్క పౌరుడూ వ్యక్తిగత త్యాగం చేశాడని, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సలహానూ, తీసుకున్న నిర్ణయాన్నీ పాటించారని  వివరించారు. 


ఎన్‌బీఏ నిరసన

రెండేళ్ల పాటు మీడియా సంస్థల్లో ప్రభుత్వ, పీఎ్‌సయూల ప్రకటనలు ఇవ్వొద్దంటూ సోనియా చేసిన సూచనపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ సంఘం (ఎన్‌బీఏ) నిరసన వ్యక్తం చేసింది. ఇది మొత్తం మీడియానే ఇబ్బందుల పాల్జేస్తుందని, ఈ సూచన తీవ్ర నిరాశా నిస్పృహలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. ‘ప్రస్తుత సమయంలో ప్రాణాలకు తెగించి న్యూస్‌ మీడియా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను, విపక్షాల సూచనలను చేరవేస్తున్నారు. ప్రజల బాధలను చూపుతున్నారు. అసలే మాంద్యం వల్ల ఎలకా్ట్రనిక్‌ మీడియా ఆదాయం దారుణంగా పడిపోయింది. లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలూ మూతపడడం వల్ల ఆక్కడి నుంచి కూడా ఆదాయం పడిపోయింది. పైపెచ్చు మీడియా యాజమాన్యాలు తమ ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఎంతో ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రె్‌సలాంటి సంస్థ నుంచి ఇలాంటి సూచన రావడం దురదృష్టకరం.. నిరాశాపూరితం’’ అని ఎన్‌బీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-08T07:27:16+05:30 IST