రష్యాలో కరోనా విలయం

ABN , First Publish Date - 2020-05-30T08:17:24+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతూనే ఉంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది.

రష్యాలో కరోనా విలయం

ఒక్కరోజే 8572 పాజిటివ్‌ కేసులు.. అమెరికాలో 1800 


వాషింగ్టన్‌, మే 29: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతూనే ఉంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. శుక్రవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 59.40 లక్షలకు చేరగా.. 3.62 లక్షల మంది ఈ మహమ్మారి వలన ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో శుక్రవారం 8,572 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,87,623 దాటేసింది. 24 గంటల్లో 232 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,374కి పెరిగింది. కాగా.. న్యూజిలాండ్‌ పూర్తిగా కరోనా నిర్మూలన దిశగా అడుగులు వేస్తోంది. 50 లక్షల జనాభా కలిగిన ఈ దేశంలో ప్రస్తుతానికి ఒకే ఒక యాక్టివ్‌ కేసు ఉంది. దేశంలో ఇప్పటి వరకు 1,504 మంది వైరస్‌ బారినపడగా.. 22 మంది చనిపోయారు.


ఒక్కరు మినహా అందరూ కోలుకున్నారు. అమెరికాలో తాజాగా 21,190 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. 1082 మరణాలు సంభవించాయి. మెక్సికోలో 3,377 మందికి వైరస్‌ సోకింది. 24 గంటల్లో 447 మంది చనిపోయారు. పాకిస్థాన్‌లో కొత్తగా 2,801 కేసులు బయటపడ్డాయి. 57 మరణాలు సంభవించాయి. చైనాలో లక్షణాలు కనిపించకుండా ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ఈ తరహా కేసుల సంఖ్య 409కి పెరిగింది. 


బ్రిటన్‌లో భారత సంతతి వైద్యుడి మృతి

కరోనా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న రాజేశ్‌ గుప్తా అనే భారత సంతతి డాక్టర్‌ బ్రిటన్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బ్రిటన్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీ్‌సలో భాగంగా రాజేశ్‌ బెర్క్‌షైర్‌లోని వెక్స్‌హామ్‌ పార్క్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ఉంటున్న హోటల్‌ గదిలో విగత జీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు.

Updated Date - 2020-05-30T08:17:24+05:30 IST