ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-03-02T08:26:08+05:30 IST

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) గజగజలాడిస్తోంది. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకూ పాకింది. పశ్చిమాసియా, యూర్‌పలో అనేక ప్రాంతాల్లో కొత్తగా వ్యాప్తి చెందుతోంది. ఇరాన్‌లో 24 గంటల వ్యవధిలో...

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా

  • అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకూ పాకిన వైరస్‌
  • ఇరాన్‌లో 24 గంటల్లో మరో 11 మంది మృతి
  • 54కు చేరిన మరణాలు, 978కి పెరిగిన కేసులు
  • ఆ దేశంలో చిక్కుకున్న పలువురు భారతీయులు
  • వీడియో పంపిన 17 మంది కేరళ మత్స్యకారులు
  • పాక్‌లో 4 కేసులు.. అఫ్ఘాన్‌తో సరిహద్దు మూసివేత
  • దక్షిణ కొరియాలో కొత్తగా 376 కేసుల గుర్తింపు

న్యూఢిల్లీ, మార్చి 1: ప్రపంచాన్ని కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) గజగజలాడిస్తోంది. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకూ పాకింది. పశ్చిమాసియా, యూర్‌పలో అనేక ప్రాంతాల్లో కొత్తగా వ్యాప్తి చెందుతోంది. ఇరాన్‌లో 24 గంటల వ్యవధిలో మరో 11 మందిని బలి తీసుకుందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 54కు చేరింది. కొత్తగా నమోదైన 385 కేసులతో ఆ సంఖ్య 978కి పెరిగింది. అయితే ఇరాన్‌లోని వివిధ ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కరోనా సోకి 210 మంది మరణించారని బీబీసీ చెబుతోంది.


కేరళకు చెందిన 17 మంది జాలర్లు ఇరాన్‌లో చిక్కుకున్నారు. అక్కడ నుంచి పంపిన వీడియాను బట్టి వారంతా ఒక గదిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆంక్షల వల్ల బయటకు వెళ్లే పరిస్థితి లేదని వారు తెలిపారు. ఇరాన్‌లోని ఇతర నగరాల్లో కూడా తమ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఉన్నారని, కనీసం వారితోనైనా మాట్లాడే అవకాశం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాయం చేయాలని భారత అధికారులను వేడుకొన్నారు. చేపలు పట్టే పనికి నాలుగు నెలల క్రితం వారంతా ఇరాన్‌కు వెళ్లారు. జాలర్లతో పాటు పలువురు భారతీయులు ఇరాన్‌లో చిక్కుకుపోయిన సమాచారం అందిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ ఆదివారం తెలిపారు. ఈ అంశంపై టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఇరాన్‌ అధికారులతో మాట్లాడుతోందని తెలిపారు. స్వదేశం వెళ్లిపోవాలనుకునే భారతీయులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబారి జి.ధర్మేంద్ర శనివారం తెలిపారు. ఇరాన్‌ పొరుగు దేశమైన ఆర్మేనియాలో కరోనా తొలి కేసు నమోదైనట్లు ప్రధాని నికల్‌ పషిన్‌యన్‌ వెల్లడించారు.


ఇరాన్‌తో 24 మైళ్ల సరిహద్దును ఆర్మేనియా మూసివేసింది. దుబాయ్‌ ఎమిరేట్స్‌ సంస్థ తన సిబ్బందికి సెలవులు ఇచ్చింది. సెలవు తీసుకోవాలా వద్ద అనేది సిబ్బంది ఇష్టమని తెలిపింది. ఆ సంస్థలో లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. కరోనా వల్ల నష్టాలతో 1,000 మంది సిబ్బందిని తొలగించాలని ఇజ్రాయిల్‌ ఎయిర్‌లైన్స్‌ భావిస్తోంది. వైరస్‌ భయంతో అఫ్ఘానిస్థాన్‌తో సరిహద్దులను సోమవారం నుంచి వారంపాటు మూసివేయాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దక్షిణ కొరియాలో కొత్తగా 376 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,526కు పెరిగింది. 17 మంది మృతిచెందారు. బాధితుల్లో 90 శాతం మంది దాని వ్యాప్తికి కేంద్రమైన డేగులోనే ఉన్నారు. కరోనా భయంతో స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. దేశాధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ మాట్లాడుతూ కరోనాను కట్టడి చేస్తామని, దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కిస్తామని చెప్పారు. ఆదివారం ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులకు నిర్వహించిన స్ర్కీనింగ్‌లో కరోనా అనుమానిత కేసును గుర్తించారు.  


అమెరికా, థాయ్‌, ఆస్ట్రేలియాలో తొలి మరణాలు

అమెరికా, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియాలో తొలి కరోనా వైరస్‌ మృతి కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతిచెందారని అమెరికా ఆదివారం ప్రకటించింది. అతను కరోనాతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమెరికన్లు ఆందోళన చెందవద్దని దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధైర్యం చెప్పారు. థాయ్‌లాండ్‌లో 35 ఏళ్ల వ్యక్తి మరణించారని ప్రజారోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ సోకడానికి ముందు అతను డెంగీ జ్వరంతో బాధపడ్డారని అధికారులు తెలిపారు. థాయ్‌లాండ్‌లో 42 కరోనా కేసులను గుర్తించారు. జపాన్‌లో డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడ నుంచి తరలించిన 78 ఏళ్ల వ్యక్తి ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు.


‘ముద్దు’ వద్దు: ‘స్విస్‌’ మంత్రి

వియన్నా: మొన్నటికి మొన్న ఫ్రాన్స్‌ ఆరోగ్యమంత్రి ‘కరచాలనం’ వద్దని ప్రజలకు సూచిస్తే.. ఇప్పుడు దాని పొరుగు దేశం స్విట్జర్లాండ్‌.. ఏకంగా ‘ముద్దు’నే రద్దు చేసేలా ఉంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. కొంతకాలం పాటు ‘పలకరింపు ముద్దు’కి దూరంగా ఉండాల్సిందిగా ఆ దేశ ఆరోగ్యమంత్రి ప్రజలను కోరారు. ‘స్విస్‌’ సంప్రదాయం ప్రకారం.. స్త్రీ పురుషులు పరస్పరం ముద్దులతో పలకరించుకుంటారు. ‘కరోనా’ ముప్పు పొంచివున్న తరుణంలో.. ఈ పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని ‘స్విస్‌’ మంత్రి కోరారు. 


అంటార్కిటికా మినహా... 

 అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకూ విస్తరించింది. ఇటలీలో కరోనా బారినపడి 29 మంది మృతిచెందారు. మొత్తం 1,128 కేసులు గుర్తించారు. లాంబార్డీ ప్రాంతంలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. అక్కడ 10 శాతం మంది బాధితులు వైద్య సిబ్బందే కావడం గమనార్హం. 

 ఇటలీలో ప్రబలిన వారం తర్వాత యూర్‌పలో వ్యాపించడం మొదలైంది. చాలా దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. వాటిలో డెన్మార్క్‌, రొమేనియా, గ్రీస్‌, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా ఉన్నాయి. 

 దక్షిణ అమెరికాలో కరోనా కేసు నమోదైన తొలి దేశం బ్రెజిల్‌. ఆదివారం ఈక్వెడార్‌లో కూడా మొదటి కేసు నమోదైంది. 

 పశ్చిమాసియాలో ఇరాన్‌ నుంచి కరోనా వ్యాప్తి మొదలైంది. కనీసం మరో 10 దేశాలకు వైరస్‌ పాకింది. చాలా దేశాలు తమ సరిహద్దులను మూసేస్తున్నాయి. ప్రయాణంపై ఆంక్షలు విధిస్తున్నాయి. జనం ఎక్కువగా హాజరయ్యే కార్యక్రమాలను రద్దు చేస్తున్నాయి.


కరోనాతో చైనాలో తగ్గిన కాలుష్యం: నాసా 

కరోనా దెబ్బకు చైనా కాలుష్యం తీవ్రత తగ్గిందని ‘నాసా’, ఐరోపా అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడించాయి. కరోనా ప్రభావంతో దేశంలోని చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా రవాణాపై ఆంక్షలు విధించారు. జనవరి 1 నుంచి 20 వరకు తీసిన చిత్రాల్లో గాలిలో నైట్రోజన్‌ డయాక్సైడ్‌ స్థాయులు అధికంగా కనిపించాయి. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు తీసిన చిత్రాల్లో అవి కొద్ది స్థాయిలోనే ఉన్నాయి. ఇంత భారీగా కాలుష్య స్థాయులు తగ్గిపోవడం మొదటిసారి చూస్తున్నట్లు నాసా శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

Updated Date - 2020-03-02T08:26:08+05:30 IST