గల్ఫ్‌ భారతీయులపై ప్రభావమెంత?

ABN , First Publish Date - 2020-04-14T07:52:02+05:30 IST

కరోనా ప్రభావం గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్న భారతీయులపై ఏ మేరకు పడుతుందన్న దానిపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ దేశాల్లో దాదాపు 80 లక్షల మంది భారతీయులున్నారు. ఒక్క యూఏఈలోనే 33 లక్షల మంది...

గల్ఫ్‌ భారతీయులపై ప్రభావమెంత?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: కరోనా ప్రభావం గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్న భారతీయులపై ఏ మేరకు పడుతుందన్న దానిపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ దేశాల్లో దాదాపు 80 లక్షల మంది భారతీయులున్నారు. ఒక్క యూఏఈలోనే 33 లక్షల మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, ఒమాన్‌, బహ్రెయిన్‌, కువైట్‌ల్లో ఇప్పటిదాకా వైరస్‌ బారిన పడి 115 మంది చనిపోయారు. ఈ అన్ని దేశాల్లో కలిపి దాదాపు 14500 దాకా రోగులున్నారు. వీరి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుండడంతో ఈ దేశాలన్నీ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.


సరిహద్దులను మూసేశాయి. పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలవుతున్నాయి. భారత్‌ సహా విదేశాల్లో చిక్కుబడ్డ తమ దేశస్థులను వెనక్కి తేవాలని భావిస్తున్న ఈ దేశాలు ఇందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. కాగా, ఈ అన్ని దేశాల్లోని భారతీయులెవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి తగిన సాయం అందించాల్సిందిగా కేంద్రం ఇప్పటికే అక్కడి రాయబార కార్యాలయాలను ఆదేశించింది. ప్రధాని మోదీ కూడా ఇప్పటికే సౌదీ అధినేత మొహమ్మద్‌బిన్‌ సల్మాన్‌తో పాటు ఈ అన్ని దేశాల అరంగనేతలతో ఫోన్లో మాట్లాడారు. భారతీయులెవరికీ ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. 


Updated Date - 2020-04-14T07:52:02+05:30 IST