కరోనా కంపం

ABN , First Publish Date - 2020-03-13T09:04:33+05:30 IST

క్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా ఒక్కరోజులోనే సెన్సెక్స్‌ ఏకంగా 2,919 పాయింట్లు; నిఫ్టీ 868 పాయింట్లు నష్టపోయింది! కేవలం కొన్ని గంటల్లోనే రూ.11.28 లక్షల కోట్ల మదుపరుల...

కరోనా కంపం

  • స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతి పెద్ద నష్టం
  • 70 రోజుల్లోనే రూ.1.11 లక్షల కోట్లు
  • ముఖేశ్‌ అంబానీకి జరిగిన నష్టం ఇది
  • అమెరికా, యూరప్‌ సూచీలూ 
  • పది శాతానికి పైనే పతనం


అదో కంటికి కనిపించని సూక్ష్మ జీవి! కానీ, అది ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నే గజగజ వణికిస్తోంది! ప్రపంచాన్నే శాసించే కుబేరుల కంటికి నిద్రను దూరం చేసింది! సామాన్య మదుపరి గుండెల్లో గునపాలు దించుతోంది! కోట్లాది మందిని ఇళ్లల్లోనే కట్టిపారేసింది! ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రపంచాన్ని స్తంభింపజేసింది! 

గురువారం మరోసారి ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను షేక్‌ చేసింది! అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ.. సౌత్‌ ఆఫ్రికా నుంచి స్వీడన్‌ వరకూ.. షేర్‌ మార్కెట్లన్నీ భూకంపం వచ్చినట్లు కంపించాయి! మన స్టాక్‌ మార్కెట్‌ మాటలకందని పతనాన్ని చవిచూసింది!


స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా ఒక్కరోజులోనే సెన్సెక్స్‌ ఏకంగా 2,919 పాయింట్లు; నిఫ్టీ 868 పాయింట్లు నష్టపోయింది! కేవలం కొన్ని గంటల్లోనే రూ.11.28 లక్షల కోట్ల మదుపరుల సంపదను కరోనా అమాంతం మింగేసింది. గురువారం ఉదయమే మన షేర్‌ మార్కెట్‌ నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే ఏకంగా 1800 పాయింట్లు నష్టపోయింది. అక్కడి నుంచి పతనం కొనసాగుతూనే ఉంది. ట్రేడింగ్‌ ఎప్పుడు ముగిసిపోతుందా!? అని మదుపరులు ఎదురు చూశారు. పతనం ఆగిపోవాలని దణ్ణాల మీద దణ్ణాలు పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయినా, సెన్సెక్స్‌ పాతాళాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. మన దేశంలో దాదాపు 800 కంపెనీల షేర్లు ఏడాది కిందటి స్థాయికి వెళ్లిపోయాయి.


ఆసియా కుబేరుడు ముఖేశ్‌ అంబానీ సంపద మరో రూ.40 వేల కోట్లకుపైగా ఆవిరైపోయింది. గత 70 రోజుల్లోనే ఆయన సంపద రూ.1.11 లక్షల కోట్లు కరిగిపోయిందంటే కరోనా వైరస్‌ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు! దేశీయ దిగ్గజం ఎస్బీఐ అత్యధికంగా 13.23 శాతం మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఇక, అమెరికా మార్కెట్ల పరిస్థితి కూడా ఇంతే! ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డౌజోన్స్‌ దాదాపు 10 శాతం క్రాష్‌ అయింది! 2200కుపైగా పాయింట్లు కోల్పోయింది! యూరప్‌ సూచీలు కూడా 10 శాతానికిపైగా పడిపోయాయి! ఇందుకు కారణం.. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడం.. అదే సమయంలో, వీసాల జారీని భారత్‌ బంద్‌ చేసింది. యూరప్‌ నుంచి తమ దేశానికి ప్రజల ప్రయాణాలను 30 రోజులపాటు నిలిపి వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వివిధ దేశాల్లో ప్రయాణాల్లో ఆంక్షలు.. పరిశ్రమల నిలిపివేతతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాందోళనలు పెరిగాయి. దాంతో, మార్కెట్లు కంపించాయి!

Updated Date - 2020-03-13T09:04:33+05:30 IST