5 సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్‌వేర్‌

ABN , First Publish Date - 2020-04-25T07:59:46+05:30 IST

కరోనా వైర్‌సను 5 సెకన్లలోనే గుర్తించే ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్‌ కమల్‌జైన్‌ చెబుతున్నారు.

5 సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్‌వేర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: కరోనా వైర్‌సను 5 సెకన్లలోనే గుర్తించే ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్‌ కమల్‌జైన్‌ చెబుతున్నారు. అనుమానితుల ఎక్స్‌రే స్కాన్‌ను పరిశీలించడం ద్వారా కొవిడ్‌ను గుర్తించవచ్చని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరీక్షలు జరిపితే.. టెస్టింగ్‌ ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా వైద్య సిబ్బందికి వైరస్‌ సోకే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పారు. ‘‘ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు కొవిడ్‌, న్యుమోనియా, క్షయ పేషెంట్ల ఎక్స్‌రేలు సహా మొత్తం 60 వేల ఎక్స్‌రే స్కాన్‌లను విశ్లేషించాను. ఊపిరితిత్తుల్లో పేరుకున్న శ్లేష్మం ఆధారంగా ఈ మూడు జబ్బుల రోగులను విడివిడిగా గుర్తించగలిగాను’’ అని జైన్‌ వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వైద్యులు.. అనుమానితుల ఎక్స్‌రేలను అప్‌లోడ్‌ చేసి కేవలం 5 సెకన్లలో కరోనా ఉందో లేదో తేల్చేయవచ్చని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి తనకు 40 రోజులు పట్టిందని, పేటెంట్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. కాగా, ‘బాడీ టెంపరేచర్‌ మ్యాపింగ్‌’తో  కరోనా లక్షణాలను గుర్తించే ఓ రిమోట్‌ కంట్రోల్డ్‌ ఆపరేటింగ్‌ డివైజ్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ రోపర్‌ పరిశోధకులు వెల్లడించారు. మాన్యువల్‌ పరీక్షలకు ఇది సరైన ప్రత్యామ్నాయమన్నారు.

Updated Date - 2020-04-25T07:59:46+05:30 IST