చైనాలో తగ్గుముఖం..
ABN , First Publish Date - 2020-06-25T07:08:24+05:30 IST
చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. కానీ.. 11 రోజుల్లోనే సుమారు 25 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన చైనా.. వైర్‌సను మళ్లీ అదుపులోకి తీసుకొచ్చింది...

- మెక్సికో, బ్రెజిల్‌లో తీవ్రత అధికం
బీజింగ్, జూన్ 24: చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. కానీ.. 11 రోజుల్లోనే సుమారు 25 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన చైనా.. వైర్‌సను మళ్లీ అదుపులోకి తీసుకొచ్చింది. బుధవారం ఇక్కడ 12 కేసులే నమోదయ్యాయి. వాటిలో బీజింగ్‌లో 7 ఉన్నాయి. దీంతో ఈ నగరంలో ఇటీవల నమోదైన కేసుల సంఖ్య 200 దాటింది. మంగళవారం నమోదైన 22 కేసులతో పోలిస్తే 24 గంటల్లో దాదాపు సగం తగ్గిపోయాయి. వైరస్ పుట్టినిల్లు చైనాలో కరోనా అదుపులోకి వస్తుంటే.. చాలా దేశాల్లో తీవ్రరూపం దాల్చుతోంది. టెస్టుల నిర్వహణలో ఇప్పటికీ వెనుకంజలో ఉన్న మెక్సికోలో కొత్తగా 6,200 మందికి వైరస్ సోకినట్టు తేలింది. 800 మంది చనిపోయారు. అమెరికాలోని ఆరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిసిపి, నెవడా, టెక్స్‌సలో కేసుల తీవ్రత ఎక్కువైంది. అమెరికా వ్యాప్తంగా 24 గంటల్లో 37,742 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆరిజోనాలోనే 3,600 కేసులు బయటపడ్డాయి.
దక్షిణ కొరియాలో మరో 51 మందికి వైరస్ సోకింది. బ్రెజిల్‌లో ఒక్కరోజే 40,021 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1,449 మంది మృతిచెందారు. రష్యాలో కొత్తగా 7,176 కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య 6,06,881కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 94,35,219 మందికి వైరస్ సోకగా.. వారిలో 4.781 లక్షల మంది చనిపోయారు. కాగా, కరోనా రోగులు పెరిగిపోతున్నారని దేశాలన్నీ గగ్గోలు పెడుతుంటే కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం రోగులు లేరంటూ జపాన్ తల పట్టుకొంటోంది. బయటకు వచ్చినపుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారోను ఆ దేశ కోర్టు మంగళవారం ఆదేశించింది.