మృత్యునాదం

ABN , First Publish Date - 2020-06-23T07:57:29+05:30 IST

నిన్నటిదాక కరోనా పాజిటివ్‌ కేసులే ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయనుకుంటే.. తాజాగా మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి...

మృత్యునాదం

  • దేశంలో ఒక్క రోజే 445 మంది మృతి
  • మహారాష్ట్రలోనే 186 మంది బలి
  • దేశంలో కొత్తగా 14,821 మందికి వైరస్‌

న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నిన్నటిదాక కరోనా పాజిటివ్‌ కేసులే ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయనుకుంటే.. తాజాగా మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కొవిడ్‌తో అత్యధికంగా 445 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. మరో 14,821 మంది వైరస్‌ బారినపడ్డారని కేంద్రం తెలిపింది. కాగా, క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 592 తగ్గినా.. మరణాలు 135 పెరగడం గమనార్హం. కొత్తగా నమోదైన మరణాల్లో మహారాష్ట్రవే 186 ఉన్నాయి. కర్ణాటకలో 249 కేసులు రాగా, వాటిలో బెంగళూరు నగరానివే 126 ఉన్నాయి. తమిళనాడులో అత్యధికంగా 2,710 కేసులు బయటపడ్డాయి. వీటిలో చెన్నైవే 1,487 కేసులు. 37 మంది మృతి చెందారు.  54 మంది ఉద్యోగులకు వైరస్‌ సోకడంతో  ఓఎన్‌జీసీ.. ఆరేబియా సముద్రంలోని రెండు ప్రాంతాల్లో డ్రిల్లింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు 30.04 కరోనా కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. ప్రపంచ సగటు (114.67) మన కంటే మూడు రెట్లు ఎక్కువని తెలిపింది. గర్భిణుల కొవిడ్‌ పరీక్ష ఫలితాల వెల్లడికి ఐదు నుంచి ఏడు రోజుల సమయం గడువును తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కు సూచించింది.  హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు పల్స్‌ ఆక్సీమీటర్లు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. 


సూరత్‌ వజ్రాల పరిశ్రమకు కరోనా కాటు

గుజరాత్‌లోని సూరత్‌ వజ్రాల పరిశ్రమలో పది రోజుల్లోనే 300 మంది కార్మికులు వైరస్‌ బారినపడ్డారు. కాగా, భవిష్యత్‌లో కరోనా వ్యాప్తిని అంచనా వేయడానికి ఐఐటీ ఖరగ్‌పూర్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ శాఖకు చెందిన ప్రొఫెసర్‌ అభిజిత్‌ దాస్‌ ఒక నమూనాను అభివృద్ధి చేశారు. ఈ నమూనా ప్రకారం దేశంలో సెప్టెంబరు చివరి వరకు కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంటుంది. ‘ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు ఒక రకమైన అనిశ్చిత స్థితిలో జీవిస్తున్నారు. కరోనా వ్యాప్తి గురించి ఒక అవగాహన కల్పిస్తే తదనుగుణంగా  భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకోవటానికి ప్రజలకు అవకాశం ఉంటుంది’’ అని ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ వీరేంద్ర కుమార్‌ తివారీ తెలిపారు.


కోలుకున్న న్యూయార్క్‌! తెరుచుకున్న షాపులు, వ్యాపారాలు

కరోనా విలయం నుంచి న్యూయార్క్‌ నగరం కోలుకుంటోంది. నగరంలో సోమవారం షాపులు తెరుచుకుంటున్నాయి. మూడు నెలల తర్వాత సాధారణ స్టోర్ల నుంచి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఆఫీస్‌ టవర్ల వరకు అన్నీ తెరుచుకున్నాయి. సుమారు 1.5 నుంచి 3 లక్షల మంది వరకు తిరిగి విధుల్లో చేరారు. అమెరికాలో 24 గంటల్లో 26,079 కరోనా కేసులు నమోదయ్యాయి. 267 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 16,851 కేసులు బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం కేసులు 10 లక్షల మార్కుని దాటేశాయి. రష్యాలో 7600 మందికి వైరస్‌ సోకగా 95 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య ఆరు లక్షలకు చేరువైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. ఇందులో సగం అమెరికా, యూరప్‌ వాటానే. గత వారం రోజుల్లోనే 10 లక్షల కేసులు నమోదయ్యాయి. Read more