కరోనా మరణ ఘోష
ABN , First Publish Date - 2020-08-01T08:52:26+05:30 IST
దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి

- జూలై నెలలోనే 18 వేల మంది మృతి
- దేశంలో 31 రోజుల్లో రెట్టింపైన సంఖ్య
న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వైర్‌సతో తొలి మృతి సంభవించిన మార్చి నెల నుంచి జూన్ వరకు 17,400 మంది చనిపోగా, ఒక్క జూలై నెలలోనే వైర్‌సతో 18,347 మంది మృతి చెందారు. అంటే.. రెట్టింపును మించి నమోదయ్యాయి. దీంతో ప్రపంచ జాబితాలో భారత్ (35,747).. ఇటలీ (35,132)ని మించి ఐదో స్థానానికి చేరింది. కాగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 55,078 మందికి వైరస్ సోకిందని, 779 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ ప్రకటించింది. వరుసగా రెండో రోజూ దేశంలో 50 వేలపైగా కేసులు రావడం గమనార్హం. ఇదే సమయంలో మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. 10,57,805 మంది కోలుకున్నారని, 5,45,318 మంది చికిత్స పొందుతున్నారని కేంద్రం వెల్లడించింది.
15 వేలు దాటిన మహారాష్ట్ర మరణాలు
దేశంలో వైరస్ కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో మరణాల 15 వేలు దాటాయి. దేశంలో మొత్తం కరోనా మృతుల్లో 41 శాతం ఈ రాష్ట్రానివే. ఢిల్లీ, కర్ణాటకల్లో దాదాపు 4 వేల మంది చనిపోయారు. గుజరాత్ (2,418), కర్ణాటక (2,230)ల్లో రెండు వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్(1,630), పశ్చిమ బెంగాల్(1,536), ఆంధ్రప్రదేశ్(1,281)లో వెయ్యికిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో మరోసారి 10,320 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,195 కేసులు వచ్చాయి. పరిస్థితి తీవ్రత తగ్గడంతో పాటు అన్‌లాక్-3లో భాగంగా హోటళ్లు, వార మార్కెట్లకు అనుమతివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తిరస్కరించారు. ఢిల్లీలో శనివారం నుంచి రెండో సీరో సర్వే ప్రారంభం కానుంది. కాగా, తమిళనాడులో కరోనాతో 97 మంది మరణించారు. మొత్తం కేసులు 2,45,794కి చేరాయి. ఆదివారాల్లో విధిస్తున్న సంపూర్ణ లాక్‌డౌన్‌ను కర్ణాటక ఎత్తివేసింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,24,115కి చేరాయి. తాజాగా 84 మంది మృతితో మొత్తం మృతుల సంఖ్య 2,314కి చేరింది.
వెంటిలేటర్‌పై 0.28 శాతం మందే..
8 2.18 శాతానికి మరణాల రేటు
దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని.. ప్రస్తుతం 2.18 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కేవలం 0.28 మంది మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. యాక్టివ్ కేసుల్లో 1.61 శాతం మందికే ఐసీయూ చికిత్స, 2.32 శాతం మందికే ఆక్సిజన్ అవసరం ఉందని తెలిపారు. కొవిడ్-19పై ఏర్పాటైన మంత్రుల బృంద సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 64.54 శాతానికి చేరింది. అంటే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారు 33.27 మందే ఉన్నట్లు. 24 గంటల వ్యవధిలో 6.42 లక్షల పరీక్షలు చేశాం’ అని హర్షవర్ధన్ తెలిపారు. కేసుల రెట్టింపునకు 21 రోజుల వ్యవధి పడుతోందని వివరించారు.