బ్రెజిల్‌లో మృత్యు ఘోష!

ABN , First Publish Date - 2020-05-29T06:57:23+05:30 IST

కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. బ్రెజిల్‌, అమెరికా, రష్యా, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వైరస్‌ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాయి. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన బ్రెజిల్‌లో 24 గంటల్లో...

బ్రెజిల్‌లో మృత్యు ఘోష!

  • ఒకే రోజు వెయ్యికిపైగా మరణాలు
  • 24 గంటల్లో 20 వేల కొత్త కేసులు

వాషింగ్టన్‌, మే 28: కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. బ్రెజిల్‌, అమెరికా, రష్యా, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వైరస్‌ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాయి. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన బ్రెజిల్‌లో 24 గంటల్లో 1,086 మరణాలు సంభవించాయి. కొత్తగా 20,599 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,821కి చేరగా.. మృతుల సంఖ్య 25 వేలు దాటింది. బ్రెజిల్‌లో విచ్చలవిడిగా పెరుగుతున్న కేసులు, మరణాల కారణంగా దర్శనమిస్తున్న సామూహిక సమాధుల తీరు చూస్తుంటే ఆగస్టు 4 నాటికి మృతుల సంఖ్య 1,25,000 దాటొచ్చని వాషింగ్టన్‌ యూనివర్సిటీ తాజాగా అంచనా వేసింది. కాగా.. రష్యాలోనూ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. గురువారమిక్కడ 8,371 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,79,051కి పెరిగింది. 24 గంటల్లో 174 మంది చనిపోయారు. ఇక వైరస్‌ ప్రభావానికి ఎక్కువ గురైన అమెరికాలో కరోనా మరణాలు లక్ష దాటేశాయి. 24 గంటల్లో ఇక్కడ 1,684 కొత్తకేసులు వెలుగుచూశాయి. 66 మంది చనిపోయారు. దేశంలో కరోనా మృతులు లక్ష దాటడంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


మృతుల కుటుంబ సభ్యులకు, బంధవులకు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాకిస్థాన్‌లో మరో 2,076 మందికి పాజిటివ్‌గా తేలగా.. 36 మంది మృతిచెందారు. చైనాలో లక్షణాలు కనిపించకుండానే వైరస్‌ వ్యాపిస్తోంది. తాజాగా ఇలాంటివి 23 కేసులు నమోదయ్యాయి. వాటిలో 19 మంది వూహాన్‌కు చెందినవారే కావడం గమనార్హం. మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా బారినుంచి బయటపడింది అనుకుంటున్న దక్షిణ కొరియాలో మళ్లీ వైరస్‌ పుంజుకుంటోంది. 24 గంటల్లో ఇక్కడ 79 కేసులు వెలుగు చూశాయి. గత 50 రోజుల్లో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. సింగపూర్‌లో కొత్తగా 373 కేసులు వెలుగుచూశాయి.


కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే.. వచ్చే నెలాఖరునాటికి దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అనుమతులిస్తామని  ఆ దేశ మంత్రి లారెన్స్‌ వాంగ్‌ ప్రకటించారు. జింబాబ్వే, మలావిలో కూడా కేసుల సంఖ్య  పెరగడంతో వైరస్‌ లక్షణాలున్న అనేక మందికి నిర్బంధ క్వారంటైన్‌కు తరలించారు. అయితే ఈ నిర్బంధం నుంచి వందలాది మంది పారిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జింబాబ్వేలో 132 మందికి, మలావిలో 101 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. చెక్‌ రిపబ్లిక్‌ జాతీయ మ్యూజియంలో కరోనా మహమ్మారి సమయంలో వాడిన మాస్కులను ప్రదర్శిస్తున్నారు.


Updated Date - 2020-05-29T06:57:23+05:30 IST