దేశంలో కేసులు భారీగా తగ్గాయ్‌!

ABN , First Publish Date - 2020-08-12T07:38:33+05:30 IST

దేశంలో వరుసగా నాలుగు రోజులు 60వేల పైనే నమోదైన కరోనా కేసులు అనూహ్యంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా 8,400 కేసులు తక్కువగా వచ్చాయి...

దేశంలో కేసులు భారీగా తగ్గాయ్‌!

  • క్రితం రోజుతో పోలిస్తే 8,400 పైనే..
  • 23 లక్షలకు చేరిన బాధితుల సంఖ్య
  • దేశంలో 45 వేలు దాటిన మరణాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 11(ఆంధ్ర జ్యోతి): దేశంలో వరుసగా నాలుగు రోజులు 60వేల పైనే నమోదైన కరోనా కేసులు అనూహ్యంగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా 8,400 కేసులు తక్కువగా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల మధ్య దేశంలో 53,601 మంది కరోనా బారినపడ్డారు. గత మంగళవారం (56,282) తర్వాత ఇవే అతి తక్కువ కేసులు కావడం గమనార్హం. ఇక వరుసగా ఏడో రోజూ అమెరికా, బ్రెజిల్‌ కంటే భారత్‌లో ఎక్కువ కేసులు వచ్చాయి.


వైర్‌సతో తాజాగా 871 మంది మృతి చెందినట్లు కేంద్రం పేర్కొంది. క్రితం రోజు మరణాల (1,007)తో పోలిస్తే ఇది 136 తక్కువ. మొత్తం మరణాలు 45 వేలను మించాయి. శనివారం రికార్డు స్థాయిలో 7 లక్షల పరీక్షలు చేయగా.. ఆది, సోమవారాల్లో 5 లక్షలకు మించలేదు. మరోవైపు మంగళవారం రాత్రికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23 లక్షలను సమీపించింది. రికవరీ రేటు 69.80కి చేరిందని, మరణాల రేటు 1.99 అని కేంద్రం తెలిపింది. రోజుకు ప్రతి పది లక్షల మందికి 506 మందికి పరీక్షలు చేస్తున్నట్లు వివరించింది.


దేశంలో 10 లక్షల మందికి 18 వేల పరీక్షలే..

కొన్ని వారాలుగా దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచినప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ బాగా వెనుకబడి ఉంది. ఇప్పటికీ మనవద్ద ప్రతి 10 లక్షల మందికి 18 వేల మందికే పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో భారత్‌ 16వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా.. అమెరికా, బ్రెజిల్‌ను మించి.. ఆగస్టు 4-10వ తేదీల మధ్య ప్రపంచంలో భారత్‌లోనే రోజువారీ అత్యధిక కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ వారం రోజుల్లో ప్రపంచ కేసుల్లో భారత్‌ వాటా 23 శాతమని, మరణాల్లో 15 శాతం కంటే ఎక్కువని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జసిందా ఆర్డెన్‌ వెల్లడించారు. కాగా, కొత్త కేసులు, మరణాల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లవే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ డిశ్చార్జయ్యారు. అసోంలో ప్లాస్మా దానానికి 300 మందిపైగా ఆరోగ్య కార్యకర్తలు ముందుకొచ్చారు. 


ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లు దాటేశాయ్‌..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్‌ ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వ్యాపించింది. తొలి కోటి కేసుల నమోదుకు 6 నెలలు పట్టగా.. తర్వాతి కోటి కేసులకు 6 వారాలే పట్టింది. వాటిలో సగానికిపైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే ఉన్నాయి. కాగా, వైరస్‌ పూర్తిగా నిర్మూలించినట్టు ప్రకటించిన న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత నాలుగు కరోనా కేసులు బయటపడ్డాయి. Updated Date - 2020-08-12T07:38:33+05:30 IST