నెలలో 100 రెట్లు

ABN , First Publish Date - 2020-04-15T08:51:02+05:30 IST

మన దేశంలో మొదట్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పట్టగా ఆ తర్వాత అది 7 రోజులకు, ఇప్పుడు నాలుగు రోజులకు తగ్గింది. లాక్‌డౌన్‌ లేకుంటే ఈ వేగం మరింత ఎక్కువగా...

నెలలో 100 రెట్లు

మన దేశంలో మొదట్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పట్టగా ఆ తర్వాత అది 7 రోజులకు, ఇప్పుడు నాలుగు రోజులకు తగ్గింది. లాక్‌డౌన్‌ లేకుంటే ఈ వేగం మరింత ఎక్కువగా ఉండేది. 

-రవి శంకర్‌ ఝా, ప్రముఖ పల్మనాలజిస్టు


  • మార్చి 14న దేశంలో 100 కేసులు
  • ఏప్రిల్‌ 14కు 10 వేలకు పైగా నమోదు
  • 21 రోజుల లాక్‌డౌన్‌లోనే పరిస్థితి ఇది
  • కానీ.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే
  • కరోనా కట్టడిలో భారతదేశమే మెరుగు
  • అమెరికాలో నెలలో 100 నుంచి 2 లక్షలకు!
  • ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాల్లోనూ అంతే
  • లాక్‌డౌన్‌ పటిష్ఠ అమలుతోనే  ఈ ఫలితాలు
  • మర్కజ్‌ ప్రార్థనల వల్లే కేసుల భారీ పెరుగుదల
  • కేసులు తక్కువేగానీ.. పెరుగుదల ఇంకా పైపైకే!
  • మరో రెండు దశలు దాటితేనే మనకు విముక్తి


ఇరవై ఒక్క రోజుల లాక్‌డౌన్‌ను మే మూడు దాకా పొడిగిస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేశారు సరే..! ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి మరీ విధించిన ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ ఏమైనా ఫలితమిచ్చిందా? ఈ మూడు వారాల్లో నమోదైన 10 వేలకు పైగా కేసులు, 350కి పైగా మరణాలు ఏం చెబుతున్నాయి? ఇన్ని పాజిటివ్‌లు, మరణాలు నమోదు కావడం లాక్‌డౌన్‌ విఫలమైందనడానికి చిహ్నమా? లేక పాశ్చాత్యదేశాల్లోలాగా.. కేసుల సంఖ్య లక్షల్లోకి, మరణాల సంఖ్య వేలల్లోకి వెళ్లకపోవడం లాక్‌డౌన్‌ విజయవంతమైందనడానికి సంకేతమా? దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? అంటే.. ఒకరకంగా లాక్‌డౌన్‌ విజయవంతమైనట్లేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. నిజంగానే దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షల్లో ఉండేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని వారు చెబుతున్నారు. గణాంకాలు చూస్తే..


  1. మార్చి 21 నాటికి.. అంటే జనతా కర్ఫ్యూ ముందు రోజుకు మనదేశంలో కరోనా సోకినవారి సంఖ్య 332. మార్చి 22న ఈ సంఖ్య 396కు చేరింది. మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ మొదలైంది. ఆ రోజుకు కేసులు 536. మరణాలు 11.
  2. ఆ తర్వాత వారానికి.. అంటే మార్చి 31 నాటికి మరణాల సంఖ్య 35కు, కేసుల సంఖ్య 1,397కు చేరింది. 
  3. రెండో వారం ముగిసేసరికి.. అంటే ఏప్రిల్‌ 7 నాటికి కేసుల సంఖ్య 4,789కి, మరణాల సంఖ్య 124కు చేరింది. 
  4. మూడోవారానికి.. అంటే ఏప్రిల్‌ 14 నాటికి దేశంలో కేసుల సంఖ్య 10,815కు చేరింది. అంటే.. మూడువారాల్లో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇక్కడొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైరస్‌ సోకినవారిలో లక్షణాలు బయటపడడానికి 14 నుంచి 18 రోజుల దాకా పడుతోంది. అంటే, ఈ 21 రోజుల్లో తొలి రెండు వారాల్లో నమోదైన కేసులన్నీ రెండు వారాల ముందు వైరస్‌ బారినపడిన వారివే. అందులో కూడా ఎక్కువ భాగం మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారివి, వారి కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగినవారివే. వారితోపాటు, మరికొంతమందికి స్థానికంగా సోకింది. 21 రోజుల్లో 10 వేల కేసులంటే ఎక్కువగానే కనిపించవచ్చుగానీ.. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న, జనసాంద్రత అధికంగా ఉన్న భారత్‌లాంటి దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, యూకే, ఫ్రాన్స్‌ వంటి అభివృద్ధిచెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుదల వేగం తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం.   


పాశ్చాత్య దేశాల్లో..

మనదేశంలో వంద కేసులు మార్చి 13 నాటికి నమోదవగా.. ఏప్రిల్‌ 13కు 10 వేలకు చేరింది. అదే అమెరికాలో మార్చి 2 నాటికి తొలి వంద కేసులు నమోదు కాగా.. ఏప్రిల్‌ 2 నాటికి కేసుల సంఖ్య 2.46 లక్షలకు చేరింది. ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాల్లోనూ ఇదే తరహాలో కేసుల సంఖ్య 100 నుంచి నెలలోపే లక్ష దాటేసింది. వాటితో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడమేనని  ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. మొదట్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పట్టగా ఆ తర్వాత అది 7 రోజులకు, ఇప్పుడు నాలుగు రోజులకు తగ్గిందని.. లాక్‌డౌన్‌ లేకుంటే ఈ వేగం మరింత ఎక్కువగా ఉండేదని రవి శంకర్‌ ఝా అనే మరో వైద్యుడు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతానికి మనం ఇంకా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న దశలో ఉన్నాం. కానీ.. భౌతిక దూరం, మాస్కుల ఆవశ్యకత ప్రజలకు బాగా తెలిసింది కాబట్టి ఇకపై కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చు’’ అని విశ్లేషించారు. వ్యాక్సిన్‌ను కనుగొనేదాకా వైర్‌సను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.


లాక్‌డౌన్‌తోపాటు..

ఈ 21 రోజుల్లో లాక్‌డౌన్‌కే పరిమితం కాకుండా.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ (వైరస్‌ సోకినవారికి దగ్గరగా మెలిగినవారిని గుర్తించడం), టెస్టింగ్‌ (వైద్య పరీక్షలు చేయించడం), ఐసోలేషన్‌, క్వారంటైన్‌ చేయడం వంటి చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. దీనివల్ల కూడా మనదేశంలో కేసుల సంఖ్య తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌తో పాటు ఈ చర్యలన్నీ చేపట్టకుండా ఉండి ఉంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్‌ 15 నాటికి 8.2 లక్షలకు చేరి ఉండేదని వివరించింది. నిజానికి ఇందులో కూడా ఎక్కువ కేసులు మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైనవారివి, వారితో సన్నిహితంగా ఉన్నవారివేనని.. ఆ కేసులు లేకుంటే భారత్‌ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడింది.


కేసులు తక్కువేగానీ..

అభివృద్ధి చెందిన చాలా దేశాలతో పోలిస్తే.. మనదేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉందిగానీ.. పెరుగుదల గ్రాఫ్‌ పైపైకే పోతోందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంటువ్యాధులు సంభవించినప్పుడు .. వ్యాధి వ్యాప్తి (ల్యాగ్‌), పెరుగుదల (లాగ్‌ లేదా ఎక్స్‌పోనెన్షియల్‌ ఫేజ్‌), స్థిరత్వం (స్టేషనరీ- ఈ దశలో కనీస సంఖ్యలో మాత్రమే కేసులు నమోదవుతుంటాయి), పూర్తిగా కట్టడి (ఈ దశను ‘డెత్‌’ అంటారు. ఈ దశలో.. వైరస్‌ సోకినవారికి నయమై ఇంటికి వస్తుంటారు. కొత్త కేసులేవీ నమోదు కావు) అనే దశలు ఉంటాయి. చైనాలో కరోనా ప్రస్తుతం మూడో దశలో ఉన్నట్టు చెప్పొచ్చు. నిజానికి ఆ దేశం నాలుగో దశలోకి చేరినట్టు భావించారుగానీ.. మళ్లీ కొత్తగా కేసుల సంఖ్య (కనీస స్థాయిలో) పెరుగుతోంది. ఆ కోణంలో చూస్తే.. మనదేశం మార్చి 4న రెండో దశ (లాగ్‌)లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ను పొడిగించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి చర్యల ద్వారా ఈ పెరుగుదలను తగ్గించగలిగితే క్రమంగా స్టేషనరీ, ఆ తర్వాత కట్టడి దశలోకి వెళతాం. అప్పటికిగానీ ముప్పు తగ్గినట్టు కాదు. అప్పటిదాకా అన్ని జాగ్రత్తలూ పాటించాల్సిందే. వైర్‌సపై పోరు కొనసాగించాల్సిందే. -సెంట్రల్‌ డెస్క్‌


టెస్టులు తక్కువే!

మనదేశంలో కేసుల సంఖ్య తక్కువన్నమాట నిజమేగానీ.. వైరస్‌ సోకినవారిని గుర్తించడానికి చేస్తున్న పరీక్షలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. అసలు అందుకే మనదేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందనే విమర్శలూ ఉన్నాయి. గణాంకాలను పరిశీలిస్తే.. అమెరికాలో ఇప్పటిదాకా 28 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. ఇటలీలో 10 లక్షల మందికి చేశారు. దక్షిణ కొరియాలో 5 లక్షల మందికి చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఇప్పటిదాకా కేవలం 2 లక్షల నమూనాలను మాత్రమే పరీక్షించారు. అందుకే.. మనదేశంలో ర్యాండమ్‌, పూల్‌ టెస్టింగ్‌ చేయాలని శాస్త్రజ్ఞులు పదేపదే సూచిస్తున్నారు. వైరస్‌ సోకినవారిని ఎంత పెద్ద ఎత్తున గుర్తించగలిగితే అంతగా వైర్‌సవ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నది వారి మాట. 


భారత్‌ భేష్‌..

లాక్‌డౌన్‌ అమలులో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశమే అద్భుతంగా పనిచేసిందని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌కు సంబంధించి వారు రూపొందించిన ఒక ఇండెక్స్‌లో భారత్‌కు 100 స్కోరు రాగా.. అమెరికా స్కోర్‌ 66.7 మాత్రమే కావడం గమనార్హం. వారు పేర్కొన్నదాని ప్రకారం.. లాక్‌డౌన్‌ విధించే సమయానికి మనదేశంలో కేసుల సంఖ్యలో రోజూ 22ు పెరుగుదల ఉండేది. లాక్‌డౌన్‌ విధించిన మొదటివారంలో అది 14 శాతానికి తగ్గింది. మళ్లీ రెండోవారం నుంచి పెరిగి 17 శాతం పెరుగుదల నమోదైంది. ఈ విషయంలో మనతో పోలిస్తే డెన్మార్క్‌, ఆస్ట్రేలియా మెరుగ్గా ఉన్నాయని ఆ ఇండెక్స్‌ స్పష్టం చేస్తోంది. డెన్మార్క్‌లో లాక్‌డౌన్‌కు ముందు లెక్కలతో పోలిస్తే.. కొత్త కేసుల సంఖ్య 58 పర్సంటేజ్‌ పాయింట్లు తగ్గింది. ఆస్ట్రేలియాలో అయితే లాక్‌డౌన్‌ విధించాక కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల సగటున 3 శాతమే ఉండడం గమనార్హం. ఇక.. అసలు లాక్‌డౌనే విధించకుండా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిన దేశాల్లో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ‘ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌’ సూత్రాన్ని పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా దక్షిణ కొరియా అద్భుత ఫలితాలను సాధించింది.


వంద నుంచి.. వేలు, లక్షల్లోకి!

వివిధ దేశాల్లో తొలి వంద కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన రోజు నుంచి నెల రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో చూస్తే..

దేశం తొలి వంద నెల ఇప్పుడు

కేసులు రోజులకు

భారత్‌ మార్చి 14 10,815 10,815

అమెరికా మార్చి 2 2,46,729 5,86,941

స్పెయిన్‌ మార్చి 2 1,12,065 1,70,099

ఇటలీ ఫిబ్రవరి 23 63,927 1,59,516

ఫ్రాన్ప్‌ ఫిబ్రవరి 29 40,174 1,36,779

జర్మనీ మార్చి 1 77,981 1,30,072

యూకే మార్చి 5 47,806 88621

ఇరాన్‌ ఫిబ్రవరి 26 29,406 73,303

దక్షిణకొరియా ఫిబ్రవరి 20 8,652 10,537


Updated Date - 2020-04-15T08:51:02+05:30 IST