9 లక్షలు దాటాయి

ABN , First Publish Date - 2020-07-14T06:50:16+05:30 IST

దేశంలో కరోనా కేసులు 9 లక్షలు దాటేశాయి. రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రికి దేశంలో కేసుల సంఖ్య 9,01,171కు చేరుకుంది. 3 రోజుల్లోనే లక్షకు పైగా కేసులు పెరగడం విశేషం...

9 లక్షలు దాటాయి

  • దేశంలో మూడు రోజుల్లోనే లక్ష కేసులు
  • కొత్తగా 28,701 మందికి కరోనా వైరస్‌
  • 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు అధికం: కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలో కరోనా కేసులు 9 లక్షలు దాటేశాయి. రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రికి దేశంలో కేసుల సంఖ్య 9,01,171కు చేరుకుంది. 3 రోజుల్లోనే లక్షకు పైగా కేసులు పెరగడం విశేషం. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 28,701 మంది వైరస్‌ బారినపడ్డారని, 500 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 63.01 శాతం మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే అధికంగా ఉందని పేర్కొంది. 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ స్థాయి (2.64) కంటే తక్కువగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 2,19,103 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి   పేర్కొంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఏర్పాటు చేసిన సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌  నుంచి తొలిసారి కరోనా రోగి ఒకరు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ 147 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో రెండ్రోజుల పాటు 8 వేలు, 7 వేల పైగా కేసులు రాగా.. సోమవారం సంఖ్య తగ్గింది. కొత్తగా అక్కడ 6,497 మందికి వైరస్‌ సోకింది. 193 మంది మృతిచెందారు. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వరుసగా రెండో రోజూ ఆ రాష్ట్రంలో 71 మంది చనిపోయారు. తమిళనాడులో తాజాగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. 


రోడ్డుపక్కనే తాత్కాలిక క్వారంటైన్‌

 క్వారంటైన్‌ కేంద్రంలో కనీస సదుపాయాల్లేని కారణంగా ఓ పంచాయతీ సభ్యుడు కుటుంబంతో పాటు రోడ్డుపక్కన తాత్కాలికంగా గుడిసె ఏర్పాటు చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం బాగల్కోటె జిల్లా బాదామి తాలూకా కుళగేరి క్రాస్‌లో హనుమంత అనే పంచాయతీ సభ్యుడు అరుబయట గుడిసెలో స్వీయ నిర్బంధంలో ఉండటం సర్వత్రా చర్చకు కారణమైంది.     కాగా, బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ల ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబై నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ధార్వాడ జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ధార్వాడలో బుధవారం నుంచి 9 రోజులు, దక్షిణ కన్నడ జిల్లాలో వారం రోజులు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.  కర్ణాటకలో సోమవారం కొత్తగా 2,738 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 1,315 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బెంగళూరులో బాధితులు 20వేలకు చేరువయ్యారు. కాగా, విప్రో కంపెనీలలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు. కశ్మీర్‌ లోయలోని పలు ప్రాంతాల్లో  మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. 


గెలిచామనుకుంటున్నారా? 

కొవిడ్‌పై  కేంద్రానికి రాహుల్‌ ప్రశ్న

కరోనాపై విజయం సాధించామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. కొవిడ్‌పై దేశం విజయం సాధించిందని, ఈ వైర్‌సను ప్రజల సహకారంతో ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘కొవిడ్‌పై మోదీ సర్కారు విజయం సాధించింది అనుకుంటున్నారా? దేశంలో కేసులు, మరణాలు తగ్గాయని భావిస్తున్నారా?’ అని ట్విటర్‌లో సూటిగా ప్రశ్నించారు. భారత్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న గ్రాఫ్‌ను జతచేశారు. 


Updated Date - 2020-07-14T06:50:16+05:30 IST