40 వేల దిగువకు పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-11-25T07:41:36+05:30 IST

దేశంలో కరోనా కొత్త కేసులు 40 వేలలోపు నమోదయ్యాయి. ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోనూ పాజిటివ్‌లు 5వేలకు మించలేదు. సోమవారం 37,975 మందికి వైరస్‌ సోకిందని, 480 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 13.8శాతం తగ్గాయి...

40 వేల దిగువకు పాజిటివ్‌లు

  • కొత్తగా 37,975 కేసులు, 480 మరణాలు


న్యూఢిల్లీ, నవంబరు 24: దేశంలో కరోనా కొత్త కేసులు 40 వేలలోపు నమోదయ్యాయి. ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోనూ పాజిటివ్‌లు 5వేలకు మించలేదు. సోమవారం 37,975 మందికి వైరస్‌ సోకిందని, 480 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 13.8శాతం తగ్గాయి. సాధారణ రోజుల్లో పది లక్షలపైగా పరీక్షలు చేస్తుండగా.. ఆదివారం 8.49 లక్షల టెస్టులే చేయడం దీనికి కారణం.  ఢిల్లీలో కొత్తగా 121 మరణాలు నమోదయ్యాయి. 4,454 మందికి వైరస్‌ సోకింది. పాజిటివ్‌ రేటు 11.94గా ఉంది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌తోపాటు రాజస్థాన్‌, కేరళలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి.  నవంబరులో.. పాజిటివ్‌లు, మరణాల పెరుగుదల శాతం హిమాచల్‌ప్రదేశ్‌లో అధికంగా ఉంది.


నెగెటివ్‌ నివేదిక తప్పనిసరి

శబరిమలలో నెగెటివ్‌ రిపోర్టు నిబంధనను తాత్కాలికంగా అక్కడ ఏర్పాటయ్యే దుకాణాల్లో పనిచేసేవారికీ వర్తింపచేయాలని నిర్ణయించారు.వచ్చే ఏడాది జరుగనున్న కుంభమేళా సందర్భంగా హరిద్వార్‌లో గంగా నదిలో పవిత్ర స్నానాలు చేయాలంటే.. నెగెటివ్‌ నివేదిక కచ్చితం చేయాలని ఉత్తరాఖండ్‌ ఆలోచిస్తోంది. 


ఆర్టీ పీసీఆర్‌ టెస్టుల్లో అడ్డగోలు దోపిడీ

కరోనా నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌కు దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండేలా చూడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నోటీసు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ధరలు వివిధ రకాలుగా ఉన్నాయని, పరీక్ష కిట్లు రూ.200కే లభిస్తుండగా.. టెస్టులకు మాత్రం రూ.900 నుంచి రూ.2800 వరకు వసూలు చేస్తున్నారని, దీనిని రూ.400కు పరిమితం చేయాలంటూ న్యాయవాది అజయ్‌ అగర్వాల్‌ ఈ పిల్‌ వేశారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ల్యాబ్‌లు రూ.కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. 


Read more