ప్రతి రాష్ట్రంలోనూ పతాకస్థాయికి కరోనా!

ABN , First Publish Date - 2020-05-18T08:58:10+05:30 IST

కరోనా వ్యాప్తి.. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక దశలో పతాకస్థాయికి చేరుకుంటుందని, ఈ విషయంలో రాష్ట్రాల మధ్య సారూప్యత ఉండదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రొఫెసర్‌ గిరిధర్‌ ఆర్‌ బాబు...

ప్రతి రాష్ట్రంలోనూ పతాకస్థాయికి కరోనా!

  • ప్రొఫెసర్‌ గిరిధర్‌ అంచనా


బెంగళూరు, మే 17: కరోనా వ్యాప్తి.. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక దశలో పతాకస్థాయికి చేరుకుంటుందని, ఈ విషయంలో రాష్ట్రాల మధ్య సారూప్యత ఉండదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రొఫెసర్‌ గిరిధర్‌ ఆర్‌ బాబు అన్నారు. ప్రతి రాష్ట్రాన్ని ఒక దేశంలా భావించి కృషి చేస్తే.. పతాకస్థాయిని కొంతకాలం పాటు వాయిదా వేయగలమని చెప్పారు. పటిష్ఠమైన నిఘాతోనే కరోనాను ఎదుర్కోగలమని, దీనికి జిల్లాల స్థాయిలో ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు. నిఘా వ్యవస్థ బాగున్న చోట కేసులు అధికంగా నమోదవుతాయని, అప్పుడు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉందని, నియంత్రణ స్థాయిని మించిపోతోందని తెలిపారు. ఆ రాష్ట్రాల్లో మరణాల రేటు తగ్గించేందుకు భిన్నమైన విధానాలను అనుసరిస్తే, మిగిలిన రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు అది ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.


ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదవని జిల్లాల విషయంలోనే తనకు ఆందోళన అధికంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన కర్ణాటకలోని మూడు జిల్లాలను ఉదాహరణగా చూపారు. నిన్నమొన్నటి వరకు ఆ జిల్లాల్లో ఒక్క కేసూ నమోదుకాలేదని, ఇప్పుడు ఒక్క సారిగా అవి హాట్‌స్పాట్లుగా మారిపోయాయని తెలిపారు. నిఘా లోపమే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2020-05-18T08:58:10+05:30 IST