బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్, లాఠీఛార్జ్
ABN , First Publish Date - 2020-10-08T19:58:34+05:30 IST
బీజేపీ నేతల వరుస హత్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నిర్వహించిన ’చలో సెక్రెటేరియట్’ ఆందోళనకరంగా మారింది.

కోల్‌కతా : బీజేపీ నేతల వరుస హత్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నిర్వహించిన ’చలో సెక్రెటేరియట్’ ఆందోళనకరంగా మారింది. యువమోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో బారికేడ్లను కూడా దాటుకొని సెక్రెటేరియట్ వైపు దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్‌ను, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. అయినా వినకపోవడంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు మమత సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘‘తమ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమపై రాళ్లు కూడా విసిరారు? ఈ విషయాన్ని పోలీసులు గమనించలేదా?’’ అని లాకెట్ ఛటర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగానే నిరసన ప్రదర్శనను నిర్వహిస్తున్నామని, కానీ మమత సర్కార్ పరిస్థితి అదుపుతప్పేట్లుగా ప్రవర్తిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ ఆరోపించారు.
గూండాలు పోలీసుల్లో కలిసిపోయి, తమపై రాళ్లు రువ్వారని, ఈ విషయం పోలీసులకు కనిపించడం లేదా? అని వర్గీయ సూటిగా ప్రశ్నించారు. తామందరమూ మాస్కులు ధరించే నిరసనను తెలుపుతున్నామని, అయినా.. నిబంధనలన్నీ బీజేపీ కార్యకర్తలకే ఉంటాయా? అని ఆయన నిలదీశారు. ఎలాంటి భౌతిక దూరం పాటించకుండానే సీఎం మమత అనేక ర్యాలీలను నిర్వహించారని, అలాంటి వారు భౌతిక దూరం విషయంలో తమకు నీతులు చెబుతారా? అని ఆయన మండిపడ్డారు.

ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్
వరుసగా బీజేపీ కార్యకర్తల హత్యలను నిరసిస్తూ బీజేపీ ‘చలో సెక్రెటేరియట్’ కు పిలుపునిచ్చింది. దీనికి యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యం వహించారు. తాము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నా... మమత సర్కార్ తమపై వాటర్ కెనన్లను, టియర్ గ్యాస్ ను ప్రయోగించిందని ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఫ్యాక్షనిజం అంటే ఇదే. ఇళ్ల పై నుంచి తృణమూల్ గూండాలు తమపై బాంబులు విసిరారు. ఆందోళన శాంతియుతంగా చేస్తున్నా... తమపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఇంతటి నిరంకుశ ప్రభుత్వానికి కాలం దగ్గరపడింది.’’ అని తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.
