రాజస్థాన్ సంక్షోభం: సంజయ్ వాయిస్ శాంపిల్ కోసం హైకోర్టుకు పోలీసులు
ABN , First Publish Date - 2020-08-01T20:50:59+05:30 IST
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్..

జైపూర్: అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జైన్ స్వర నమూనాల కోసం రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్థానిక కోర్టులో శుక్రవారం విచారణకు హాజరైన సంజయ్.. తన వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించాడు. తనకు ఎస్‌వోజీ దర్యాప్తు మీద తనకు నమ్మకం లేదనీ... ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికను కూడా తారుమారు చేయగలరని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఎస్‌వోజీ ఏడీజీ అశోక్ రాథోడ్ మాట్లాడుతూ... ‘‘కిందికోర్టుకు వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిందితుడు నిరాకరించినందున.. చట్టపరంగా తదుపరి చర్యలకు ఉపక్రమించాం. అతడి వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తాం..’’ అని వెల్లడించారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ కోసం ఎస్‌వోజీ బృందాలు హర్యానాలోని మునేసర్‌లో గాలిస్తున్నట్టు రాథోడ్ తెలిపారు. ఆయన అక్కడ తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో తమ బృందాలు వెళ్లాయన్నారు.
సంజయ్ జైన్‌కు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయనీ.. రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చేందుకు అతడు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని బీజేపీ చెబుతోంది. జ్ఞానేంద్ర సింగ్ అనే వ్యక్తికి, ఎమ్మెల్యే శర్మకు మధ్యవర్తిగా వ్యవహరించినట్టు ఓ ఆడియో టేప్ బయటికి రావడంతో గత నెల 17న సంజయ్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆడియో టేపుల్లో మాట్లాడిన వ్యక్తి కేంద్రమంత్రి జ్ఞానేంద్ర సింగ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి ఎస్‌వోజీకి ఫిర్యాదు చేయడంతో... పోలీసులు ఈ వ్యవహారంపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.