గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి.. 10లక్షల ప్రభుత్వ పరిహారం

ABN , First Publish Date - 2020-04-10T14:06:37+05:30 IST

మైలాపూరు ప్రాంతంలో విధి నిర్వహణలో గుండెపోటుకు గురై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన సంఘటన

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి.. 10లక్షల ప్రభుత్వ పరిహారం

చెన్నై: మైలాపూరు ప్రాంతంలో విధి నిర్వహణలో గుండెపోటుకు గురై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి చెందిన సంఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఆ కానిస్టేబుల్‌ మృతికి సంతాపం తెలియజేస్తూ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మైలాపూరు ప్రాంతంలో అరుణ్‌గాంధీ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బుధవారం వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తుండగా ఉన్నట్టుండి గుండపోటుకు గురై కుప్పకూలిపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. చిన్నవయస్సు లోనే అరుణ్‌గాంధీ గుండెపోటుతో మృతి చెందటం పట్ల మైలా పూరు వాసులు, సహోద్యోగులు శోకతప్తులయ్యారు. 


అరుణ్‌గాంధీ మైలాపూరు వాసులకు సుపరిచితుడని, డ్యూటీ చేస్తున్నప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లగించేవారిని బెదరించకుండా సున్నితంగా మందలించేవారని చెబుతున్నారు. అరుణ్‌గాంధీ మృతి విషయం గురించి తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులకు పనిభారం అధికమవుతోందని, గంటల తరబడి డ్యూటీ చేయడం వల్ల తీవ్ర ఒత్తిడులకు గురవుతున్నారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుళ్ళకు తరచూ విశ్రాంతి లభించేలా షిప్ట్‌ పద్ధతుల్లో డ్యూటీ వేయాలని స్టాలిన్‌ హితవుచెప్పారు.

Updated Date - 2020-04-10T14:06:37+05:30 IST