బాలీవుడ్ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర
ABN , First Publish Date - 2020-09-16T07:16:02+05:30 IST
బాలీవుడ్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ అన్నారు. చిత్ర

చిత్రపరిశ్రమ వ్యక్తులే కించపరిచేలా మాట్లాడుతున్నారు
అన్నం పెట్టే చేతినే నరుక్కోకూడదు: జయా బచ్చన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: బాలీవుడ్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులే బాలీవుడ్‌ను కించపర్చేలా మాట్లాడుతున్నాడడం సరికాదన్నారు. రాజ్యసభలో ఆమె ఈ అంశాన్ని మంగళవారం లేవనెత్తారు. డ్రగ్స్ వాడకంపై ఇటీవల కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జయాబచ్చన్ మాట్లాడారు.
డ్రగ్స్ పేరుతో చిత్ర పరిశ్రమకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాలీవుడ్ నటులంతా డ్రగ్స్ వాడుతూ చిత్ర పరిశ్రమను మురికి కూపంలా మార్చారంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
‘కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు పరిశ్రమ మొత్తాన్ని తప్పుపట్టడం సరికాదు. చిత్ర పరిశ్రమ నుంచే వచ్చిన ఓ ఎంపీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు’ అని జయా బచ్చన్ అన్నారు. తిండి పెట్టే చెయ్యినే నరుక్కోవద్దని వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌ను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘‘జయాజీ, నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరు. మనం చిత్ర పరిశ్రమను రక్షించాల్సిన అవసరం ఉంది’’ అని రవికిషన్ అన్నారు.
మరోవైపు, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నుంచి తనకు రూ.2 కోట్లు పరిహారం ఇప్పించాలని కంగనా రనౌత్ బొంబాయి హైకోర్టును కోరారు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోదగ్గ ఆధారాలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కనుగొనలేదని లోక్‌సభకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, 10 మందిని మాత్రం ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుందని చెప్పారు.