రైతుల వెనుక పాక్, చైనా : కేంద్ర మంత్రి దాన్వే

ABN , First Publish Date - 2020-12-10T16:08:21+05:30 IST

రైతు నిరసనల వెనుక దాయాది పాక్, చైనా ఉన్నాయని, ఆ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి రావ్‌సాహేబ్ దాన్వే మండిపడ్డారు.

రైతుల వెనుక పాక్, చైనా : కేంద్ర మంత్రి దాన్వే

న్యూఢిల్లీ : రైతు నిరసనల వెనుక దాయాది పాక్, చైనా ఉన్నాయని, ఆ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి రావ్‌సాహేబ్ దాన్వే మండిపడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ విషయంలో గతంలో ముస్లింలను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదని అన్నారు. అచ్చు అలాగే రైతులను కూడా ఇప్పుడు కొందరు తప్పుడు ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఇదేమీ రైతుల ఉద్యమం కాదు. వీటి వెనుక పాక్, చైనాలున్నాయి. ఎన్నార్సీ, సీఏఏ వస్తున్నాయ్. ఆరు నెలల్లోగా మిమ్మల్ని తరిమేస్తారు అని ముస్లింలను భయపెట్టారు. ఒక్క ముస్లింనైనా వెళ్లగొట్టామా? వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రైతుల విషయంలోనూ ప్రస్తుతం అలాంటి పుకార్లే చేస్తున్నారు.’’ అని దాన్వే ధ్వజమెత్తారు. 

అయితే కేంద్రం వెంటనే స్పందించాలి : సంజయ్ రౌత్

‘‘కేంద్రమంత్రికి అలాంటి సమాచారమంటూ ఉంటే వెంటనే రక్షణ శాఖ చైనా, పాక్‌పై సర్జికల్ దాడులు చేయాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, త్రివిధ దళాలూ దీనిపై సీరియస్‌గా ఆలోచించాలి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. 

రైతులకు అవమానం : రైతు సంఘం

‘‘రైతులకే ఇది అవమానం. రైతులు స్వతహాగా ఉద్యమిస్తున్నారు. ఎవరో ఉసిగొల్పితే కాదు.’’ అని రైతు సంఘం నేత హన్నన్ మొల్లాహ్ తెలిపారు. 

Updated Date - 2020-12-10T16:08:21+05:30 IST