వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె: కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-09-21T20:50:00+05:30 IST

పార్లమెంటులో ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు..

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె: కాంగ్రెస్

న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ యోచిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కొడుకున్నిల్ సురేష్ తెలిపారు. దీనిపై పార్టీ సమవేశమై రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకోనున్నట్టు చెప్పారు.


'రైతుల మనోభావాలను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. వారి డిమాండ్లు, సమస్యలు తెలుసుకోవాలి. రైతు నేతలతో మాట్లాడాలి. ప్రభుత్వం చెప్పే మాటలను రైతులు విశ్వసించడం లేదు. వారికి బిల్లులపై చాలా అనుమానాలు ఉన్నాయి' అని సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ సురేష్ చెప్పారు. లోక్‌సభలో తాను వాయిదా తీర్మానం ప్రవేశపెట్టానని, ఏఐసీసీ ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శితో కాంగ్రెస్ పార్టీ సమావేశమవుతోందని చెప్పారు. ఈ సమావేశంలో రైతులకు మద్దతుగా నిలిచేందుందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్త సమ్మెకు వెళ్లే ఆలోచనలో పార్టీ ఉందని చెప్పారు.


యావద్దేశం బిల్లును వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరి సాగిస్తోందని సురేష్ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యం గొంతు నులమడమేనని అన్నారు. ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని రైతులంతా బిల్లులను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అయినా, బిల్లుల ఆమోదానికే ప్రభుత్వం కట్టుబడటం సరైనది కాదన్నారు. రైతులే స్వయంగా ఈ బిల్లులు వద్దంటున్నారని, అయినా సరే ప్రభుత్వం ఏమాత్రం రైతులను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వమే సొంత నిర్ణయాలు తీసుకోవడంతో చట్టంతో ఎదురయ్యే ప్రమాదాలు గ్రహించిన రైతులు రోడ్లపైకి  వస్తున్నారని సురేష్ తెలిపారు.

Updated Date - 2020-09-21T20:50:00+05:30 IST