అసంతృప్తుల్లో చీలిక? ఒంటరైన గులాంనబీ ఆజాద్?

ABN , First Publish Date - 2020-09-03T16:24:40+05:30 IST

తమకు పూర్తి స్థాయి, క్రియాశీలక అధ్యక్షుడు కావాలంటూ ఏకంగా 23 మంది సీనియర్లు లేఖ రాసి

అసంతృప్తుల్లో చీలిక? ఒంటరైన గులాంనబీ ఆజాద్?

న్యూఢిల్లీ : తమకు పూర్తి స్థాయి, క్రియాశీలక అధ్యక్షుడు కావాలంటూ ఏకంగా 23 మంది సీనియర్లు లేఖ రాసి కాక రేపిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎంపికయే ప్రధాన అజెండాగా సాగాల్సిన సీడబ్ల్యూసీ... లేఖ చుట్టే తిరిగింది. ఇదే సమావేశంలో ఎంపీ రాహుల్ గాంధీ అసమ్మతి వాదులంటూ బీజేపీ ఏజెంట్లంటూ ఘాటు విమర్శలకు కూడా దిగారు. ఈ విమర్శలు చేసిన కాసేపటికే సీనియర్లైన ఆజాద్, సిబల్ రాహుల్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్ శిబిర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.


ఆ తర్వాత ఈ 23 మంది సీనియర్ అయిన ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు. చాలా రోజుల పాటు అందరూ ఒకే తాటిపై నిలబడ్డారు. కానీ... మెళ్లి మెళ్లిగా ఆ అసంతృప్తులూ రెండు శిబిరాలుగా చీలినట్లు సమాచారం. ఒకరు లేఖ, తదనంతర పరిణామాలను మరిచిపోయి... తిరిగి క్రియాశీలకంగా మారిపోదాం అని ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. మరో వర్గంలోని నేతలు మాత్రం ఈ ప్రతిపాదనపై అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలుస్తోంది.


డిమాండ్లపై అధిష్ఠానాన్ని ఓ పట్టు పట్టాల్సిందేనని, వెనక్కి తగ్గవద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో అసమ్మతి శిబిరం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వారంలోనే మరోసారి సమావేశం కావాలని ఈ అసంతృప్తులు కొన్ని రోజుల క్రితం భావించారు. తాజాగా... ఈ సమావేశానికి హాజరు కాకూడదని ఇందులోని ఓ వర్గం డిసైడ్ అయ్యింది. మరో వర్గం మాత్రం ఈ సమావేశంలోనే తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకుంటామని, అందుకే ఈ సమావేశమని ప్రకటించింది. అంతేకాకుండా మేం లేఖలో డిమాండ్ చేసిన ఏ అంశాన్ని అధిష్ఠానం పరిశీలించలేదు కాబట్టి సమావేశం కొనసాగుతుందని ప్రకటించింది. 


అయితే లేఖ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఎంపీ శశి థరూర్ మాత్రం మళ్లీ ఈ లేఖపై చర్చించడానికి ఏమాత్రం సిద్ధపడటం లేదు. అది ‘ముగిసిన అంశమ’ని, మళ్లీ చర్చలెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జూనియర్లైన జితిన్ ప్రసాద (యూపీ), అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (బిహార్) కూడా అది ముగిసిన అధ్యాయమని పేర్కొంటున్నారు. 


అయితే ఈ శిబిరానికి అనధికారికంగా నాయకత్వం వహిస్తున్న గులాంనబీ ఆజాద్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈయనతో పాటు కపిల్ సిబల్, మనీశ్ తివారీ కూడా ఆజాద్ వైపే మొగ్గు చూపారు. లేఖలో పేర్కొన్న అంశాలపై తాము పోరాడతామని, మరి కొందరు కూడా కలిసి వస్తారని, ఇది వ్యక్తి గురించి కాదని, పార్టీ గురించి అని ఆజాద్ వర్గం స్పష్టం చేస్తోంది. 

Updated Date - 2020-09-03T16:24:40+05:30 IST