ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నేతలకు గుడులు గుర్తొస్తాయి : బీజేపీ ఎంపీ
ABN , First Publish Date - 2020-10-05T01:46:27+05:30 IST
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రాకేశ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత
భోపాల్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రాకేశ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తీరును దుయ్యబట్టారు. కమల్‌నాథ్ ఆదివారం జబల్‌పూర్‌లోని బగళాముఖి దేవాలయంలో పూజలు చేసిన నేపథ్యంలో రాకేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినపుడు మాత్రమే దేవాలయాల గురించి ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలు దేవాలయాలకు వెళ్ళరని, అందువల్ల తప్పులు చేస్తూ ఉంటారని అన్నారు. ఈ రోజు కూడా కమల్‌నాథ్ పూజలు చేసేటపుడు తప్పులు చేశారని ఆరోపించారు. దేవుడు కూడా వారికి అండగా లేడన్నారు.
భారత దేశానికి అత్యాచారాల రాజధానిగా మధ్య ప్రదేశ్ మారుతోందని కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను రాకేశ్ తప్పుబట్టారు. కమల్‌నాథ్ అధికారంలో ఉన్నపుడు రైతులు, యువత గురించి పట్టించుకోలేదన్నారు. అటువంటి నేత ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు అంగీకరించబోరని జోస్యం చెప్పారు. ఏడు నెలల క్రితం బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మధ్య ప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయన్నారు.
మధ్య ప్రదేశ్‌లో 28 శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నవంబరు 3న జరుగుతాయి. 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ముగ్గురు ఎమ్మెల్యేలు మరణించడం వల్ల ఈ ఉప ఎన్నికలు అవసరమయ్యాయి.