పూజారి కుటుంబ సభ్యులను కలిసిన కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2020-10-13T01:47:14+05:30 IST

భూకజ్జాదారుల చేతులో గతవారం సజీవదహనానికి గురైన పూజారి కుటుంబాన్ని రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు..

పూజారి కుటుంబ సభ్యులను కలిసిన కాంగ్రెస్ నేతలు

కరౌలి: భూకజ్జాదారుల చేతులో గతవారం సజీవదహనానికి గురైన పూజారి కుటుంబాన్ని రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు శుక్రవారంనాడు కలుసుకున్నారు. ఆ కుటుంబానికి తాము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు మహేష్ జోషి, అశోక్ చందన్‌ తదితరులు కరౌలీ జిల్లాలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, హత్యా ఘటన దురదృష్టకరమని, బాధితుని కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్థులందరికీ తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.


కుటుంబ సభ్యుల భద్రత తమ ప్రభుత్వ బాధ్యతని, అందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని అశోక్ చందన్ తెలిపారు. 10 లక్షల రూపాయల సాయం అందించామని, కుటుంబ సభ్యులకు భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. తమకు ఎలాంటి భయం లేదని కుటుంబ సభ్యులు భావించేంత వరకూ  భద్రత కొనసాగిస్తామని అన్నారు. కుటుంబ సభ్యులకు జరిగిన నష్టాన్ని ఎంత నష్టపరిహారం ఇచ్చినా పూడ్చలేమని, ఎంత వరకూ ప్రభుత్వం చేయగలదో అంతవరకూ సాయం అందిస్తుందని చెప్పారు. రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం ఫలితమే ఈ ఘటన అని, దయచేసి దీనికి ఇతర రంగులు పులమవద్దని కోరారు. కుటుంబ సభ్యులు కోరిన విధంగా విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటివి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, పూజారి సజీవదహనం ఘటనకు సంబంధించి కైలాష్ మీనా, దిల్‌కుష్ మీనా అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-10-13T01:47:14+05:30 IST