మహిళా కార్యకర్తను ఈడ్చిపారేశారు..

ABN , First Publish Date - 2020-10-12T07:30:46+05:30 IST

హాథ్రస్‌ ఘటన నేపథ్యంగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. అదే రాష్ట్రంలో అనుకోని చిక్కుల్లో పడింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దన్నందుకు సొంత పార్టీ వాళ్ల చేతిలో ఒక కాంగ్రెస్‌ మహిళా కార్యకర్త దాడికి గురైంది...

మహిళా కార్యకర్తను ఈడ్చిపారేశారు..

  • రేప్‌ నిందితుడికి టిక్కెట్‌ ఇవ్వొద్దన్నందుకు దాడి
  • కాంగ్రెస్‌ సమావేశంలో ఘటన
  • బీజేపీ చేతికి ఊహించని అస్త్రం

డియోరియా(యూపీ), అక్టోబరు 11: హాథ్రస్‌ ఘటన నేపథ్యంగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. అదే రాష్ట్రంలో అనుకోని చిక్కుల్లో పడింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దన్నందుకు సొంత పార్టీ వాళ్ల చేతిలో ఒక కాంగ్రెస్‌ మహిళా కార్యకర్త దాడికి గురైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి సచిన్‌ నాయక్‌.. డియోరియాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడికి తారాయాదవ్‌ అనే మహిళా కార్యకర్త వచ్చారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుంద్‌ భాస్కర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు.. ఆమెపై దాడికి దిగి చితకబాదుతూ ఈడ్చిపారేశారు. దీనిపై ప్రియాంక గాంధీ స్పందన గురించి ఎదురు చూస్తున్నానని తారా యాదవ్‌ అన్నారు. హాథ్రస్‌ ఘటనపై పోరాటం చేస్తున్న తమ పార్టీ.. అత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టిక్కెట్‌ ఎలా ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. ఊహించని అస్త్రం దొరికిందనుకున్న బీజేపీ.. విమర్శలు మొదలెట్టింది. కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు లభించే గౌరవం ఇదేనని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఎద్దేవా చేశారు. అవార్డ్‌ వాపసీ, డెత్‌ ఆఫ్‌ డెమోక్రసీ, సూడో ఫెమినిస్ట్‌ అంటూ అరోపణలు చేసే గ్యాంగ్‌ ఇప్పుడు ఎక్కడికెళ్లిందని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఆ దాడి వీడియో వైరల్‌ కావడంతో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. మానసిక అసమతుల్యత ఉన్న ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వచ్చారని ఆమె ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధినాయకత్వం.. దీన్‌దయాళ్‌యాదవ్‌, అజయ్‌ కుమార్‌ సైంత్వార్‌లను బహిష్కరించింది.


Updated Date - 2020-10-12T07:30:46+05:30 IST