దేశంలో కాంగ్రెస్ బలహీనపడిపోయింది : శివసేన

ABN , First Publish Date - 2020-12-11T16:50:59+05:30 IST

యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ నియమితులైతే మహదానందమని శివసేన ప్రకటించింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని

దేశంలో కాంగ్రెస్ బలహీనపడిపోయింది : శివసేన

ముంబై : యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ నియమితులైతే మహదానందమని శివసేన ప్రకటించింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ‘‘యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే సంతోషమే. అయితే ఈ బాధ్యతను స్వీకరించడానికి పవార్ సిద్ధంగా లేరని నేను విన్నా. ఈ అభ్యర్థన అధికారికంగా వస్తే మాత్రం మేము మద్దతిస్తాం. ప్రస్తుతం కాంగ్రెస్ చాలా బలహీనపడింది. యూపీఏను బలపరచడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.’’ అని సంజయ్ రౌత్ అన్నారు. 


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరాఠా నేత శరద్‌ పవార్‌ను యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ ఈ పదవి నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు  సోనియాగాంధీ త్వరలో ఈ బాధ్యత నుంచి తప్పుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రైతుల ఆందోళన సందర్భంగా ఇటీవల నేతలతో సంప్రదిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఈ పదవిలో కొనసాగే విషయంలో తన విముఖత ప్రదర్శించారని ఈ వ ర్గాలు వెల్లడించాయి. తన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిందిగా ఆమె సూచించారు. అంతర్గత సంభాషణలో శరద్‌ పవార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-12-11T16:50:59+05:30 IST