సోనియా ఓకే.. రెబల్స్ ఏం చెప్పబోతున్నారు?

ABN , First Publish Date - 2020-12-18T01:42:44+05:30 IST

ఈ సమావేశం శనివారం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయని, దానికి ఈ సమావేశమే కీలకమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ

సోనియా ఓకే.. రెబల్స్ ఏం చెప్పబోతున్నారు?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో సోనియాగాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి వాదులు.. త్వరలోనే సోనియాగాంధీని కలవనున్నట్లు సమాచారం. అసమ్మతి నేతలను కలిసేందుకు అధినేత సోనియా సైతం సమ్మతి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి బాధ్యతలను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చూసుకోనున్నట్లు తెలిసింది. ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముందు పార్టీ అధ్యక్షుడు సహా అనేక మార్పులను కోరుతూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే వారంతా సదరు సమావేశానికి హాజరు కాలేదు. కేవలం ఐదు-ఆరుగురు నేతలు మాత్రమే హాజరయ్యారు.


ఈ సమావేశం శనివారం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయని, దానికి ఈ సమావేశమే కీలకమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీ వాద్రా కూడా హాజరు కానున్నట్లు వినికిడి. అయితే ఇది రెబల్స్‌కు సోనియాగాంధీకి మధ్య జరిగే మీటింగ్ కాదని పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇందులో పాల్గొనన్నుట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసమ్మతి నేతల వెనుక కమల్‌నాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీకి క్షీణతపై ఆందోళన వ్యక్తం చేసిన కమల్‌నాథ్.. ‘‘పార్టీకి తాత్కాలిక అధ్యక్షులు కాకుండా శాశ్వత, చురుకైన అధ్యక్షులు కావాలి’’ అని అసమ్మతి నేతలు ఇచ్చిన పిలుపును ఆయన సమర్థించారు.


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన జ్యోతిరాదిత్య సింథియా.. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వాదులతో సమావేశం కావడానికి గాంధీలను ఒప్పించడంలో కమల్‌నాథ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలను కోల్పోయింది. రాజస్తాన్‌లో సచిన్ పైలట్ అసమ్మతికి కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోలం అయింది. అనంతరం పరిస్థితులు చక్కదిద్దుకున్నప్పటికీ పార్టీ నేతల్లో ఆందోళన అలాగే ఉంది. అంతే కాకుండా బీజేపీ తమ ప్రభుత్వానికి కూలదోయడానికి కుట్ర పన్నుతోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లోత్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రకంపనలు రేపింది.


ఇక తాజాగా బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. దీనిపై కూడా కాంగ్రెస్ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘‘ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ముగిసింది’’ అని సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం అంత పెద్దగా స్పందించలేదు. ఇక మరో సీనియర్ నేత చిదంబరం సైతం ‘‘సమగ్ర సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కలవరాన్ని రేపాయి. ఈ తరుణంలో రెబల్స్‌తో చర్చలు జరపడం పార్టీకి కీలకంగా మారింది. చర్చల్లో పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోనుంది, రెబల్స్ ఎలాంటి డిమాండ్లు, ప్రతిపాదనలు చేయనున్నారు, వాటికి అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది చర్చల అనంతరం తెలుస్తుంది.

Updated Date - 2020-12-18T01:42:44+05:30 IST