కాంగ్రెస్‌ రెండోసారి డకౌట్‌

ABN , First Publish Date - 2020-02-12T08:29:04+05:30 IST

ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ఉనికి కూడా చాటుకోలేని దుస్థితికి దిగజారింది. షీలా దీక్షిత్‌ నేతృత్వంలో గతంలో మూడుసార్లు అధికారం సాధించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు వరుసగా

కాంగ్రెస్‌ రెండోసారి డకౌట్‌

  • వరుసగా రెండు ఎన్నికల్లో రిక్త హస్తం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ఉనికి కూడా చాటుకోలేని దుస్థితికి దిగజారింది. షీలా దీక్షిత్‌ నేతృత్వంలో గతంలో మూడుసార్లు అధికారం సాధించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఖాతా కూడా తెరవలేకపోయింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన ఆ పార్టీకి.. మంగళవారం వెల్లడైన ఫలితాల్లోనూ అదే అనుభవం ఎదురైంది. మరోసారి ఒక్క స్థానం కూడా గెలవలేదు. అంతేకాదు.. ఓటింగ్‌ శాతాన్ని కూడా భారీగా కోల్పోయింది. 2015 ఎన్నికల్లో 9.7 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ ఈసారి ఐదు శాతం లోపే పరిమితమైంది. అయితే బీజేపీని ఓడించేందుకు ఆప్‌తో లోపాయికారీ పొత్తు పెట్టుకుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సంప్రదాయ కాంగ్రెస్‌ ఓటర్లు, ముస్లింలు కూడా తమ ఓటును వృథా చేసుకోరాదన్న ఉద్దేశంతో ఆప్‌కు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


1998 నుంచి 2013 వరకు షీలా ప్రభుత్వం పలు విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఢిల్లీ రూపురేఖలనే మార్చేసింది. అందుకే ఆమెను మూడుసార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కానీ, నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ ఘటన ఆమె ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో అదే ప్రధాన అంశమై షీలా సర్కారును కూల్చింది. అప్పటినుంచి ఢిల్లీలో కాంగ్రెస్‌ మళ్లీ కోలుకోలేదు. ఆప్‌, బీజేపీ మధ్యే పోటీ జరుగుతోంది. ఈ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్‌ నాయకత్వం కూడా అంగీకరించింది. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించి తిరిగి పోరాడతామని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు.

Updated Date - 2020-02-12T08:29:04+05:30 IST