భోపాల్ తిరిగొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... 'సోమవారం బల పరీక్ష...

ABN , First Publish Date - 2020-03-15T20:38:36+05:30 IST

మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ శాసన సభ్యులు ఆదివారం రాజస్థాన్ నుంచి భోపాల్ తిరిగి వచ్చారు. కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం శాసన సభలో బల పరీక్షను ఎదుర్కొనబోతోంది.

భోపాల్ తిరిగొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... 'సోమవారం బల పరీక్ష...

భోపాల్ : మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ శాసన సభ్యులు ఆదివారం రాజస్థాన్ నుంచి భోపాల్ తిరిగి వచ్చారు. కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం శాసన సభలో బల పరీక్షను ఎదుర్కొనబోతోంది. 


జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో, ఆయనకు మద్దతుగా 22 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరి రాజీనామాలతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో కాంగ్రెస్ తనకు మిగిలిన ఎమ్మెల్యేలను రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించింది. అక్కడ ఓ రిసార్ట్‌లో ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్ తిరిగి వచ్చారు. వీరు విమానాశ్రయంలో దిగిన తర్వాత, విజయ సంకేతాలు చూపుతూ బయటకు వచ్చారు. బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గుతుందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. 


సీనియర్ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం శాసన సభలో బలపరీక్షలో గెలుస్తుందన్నారు. తమ పార్టీ నేతలు రెబల్ ఎమ్మెల్యేలతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. తాము విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నామని, గెలుస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నిస్సత్తువగా ఉన్నది తాము కాదని, బీజేపీయేనని చెప్పారు. 


మధ్య ప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను సోమవారం శాసన సభలో బల పరీక్ష ఎదుర్కొనాలని శనివారం ఆదేశించారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరుగుతుంది. 


ఇదిలావుండగా, ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. బెంగళూరులో నిర్బంధంలో ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర హోం మంత్రిగా అధికారాన్ని వినియోగించి, నిర్బంధంలో ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సురక్షితంగా మధ్య ప్రదేశ్ చేరుకునేలా చూడాలని కోరారు. ఆ ఎమ్మెల్యేలు మార్చి 16 సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో ఎటువంటి ప్రలోభాలు, భయం లేకుండా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2020-03-15T20:38:36+05:30 IST