యూపీలో కాంగ్రెస్ నేత, మేనల్లుడు కాల్చివేత

ABN , First Publish Date - 2020-12-30T23:23:02+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో స్థానిక కాంగ్రెస్ నేత అశోక్ పటేల్, ఆయన మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యారు....

యూపీలో కాంగ్రెస్ నేత, మేనల్లుడు కాల్చివేత

చిత్రకూట్: ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో స్థానిక కాంగ్రెస్ నేత అశోక్ పటేల్, ఆయన మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ప్రసిద్ధపూర్ గ్రామంలో ఈ జంట హత్యలు చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పాత కక్షలతో పక్కింటి వ్యక్తే వారిని కాల్చి చంపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా ఈ హత్యలపై నిర్లక్ష్యం వహించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పహాడీ పోలీస్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రావణ్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేస్తున్నట్టు ఎస్పీ అంకిత్ మిట్టల్ వెల్లడించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ పటేల్ (55), ఆయన పొరుగింటి వ్యక్తి కమలేశ్ కుమార్‌కి మధ్య పాత గొడవలు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.


మంగళవారం రాత్రి అశోక్ పటేల్ ఇంట్లోకి వెళ్లిన కమలేశ్ కుమార్ తన రైఫిల్‌తో ఆయనపై కాల్పులు జరిపారు. విషయం తెలిసి అక్కడికి పరుగెత్తుకొచ్చిన అశోక్ మేనల్లుడు శుభమ్‌(28) పైనా కాల్పులు జరపడంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ హత్యలపై తీవ్ర ఆగ్రహానికి గురైన పటేల్ కుటుంబీకులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడు కుమార్ పరారీలో ఉన్నాడనీ.. ప్రత్యేక బృందాలతో అతడి కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ వెల్లడించారు. మరోవైపు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-12-30T23:23:02+05:30 IST