జాతీయ గీతం కరెక్టుగా పాడితేనే కాండక్ట్ సర్టిఫికెట్!
ABN , First Publish Date - 2020-06-18T14:37:27+05:30 IST
జాతీయ గీతం తప్పులు లేకుండా పాడితేనే కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తామంటున్న పుదుచ్చేరి పోలీసుల చర్యలను ప్రజలు, నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పుదుచ్చేరి లాస్‌పేట
చెన్నై: జాతీయ గీతం తప్పులు లేకుండా పాడితేనే కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తామంటున్న పుదుచ్చేరి పోలీసుల చర్యలను ప్రజలు, నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పుదుచ్చేరి లాస్‌పేట లెనిన్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు బి.కాం పూర్తిచేశాడు. అతనికి పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం లభించింది. ఇందుకోసం అతని విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు కాండక్ట్ సర్టిఫికెట్ సమర్పించాల్సిరావడంతో అతను లాస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణన్, ఏఎస్‌ఐ కీర్తిలు ఆ యువకుడిని తప్పులు లేకుండా జాతీయగీతం పాడాలని కోరగా అతను పాడలేక పోయాడు. జాతీయగీతం నేర్చుకొని బుధవారం వచ్చి తప్పులు లేకుండా పాడితే సర్టిఫికెట్ ఇస్తామని వారు పేర్కొన్నారు. దీంతో ఇంటికెళ్లిన యువకుడు రాత్రంతా జాతీయ గీతం బట్టీపట్టి బుధవారం ఉదయం స్టేషన్‌కు వచ్చి తప్పులు లేకుండా పాడడంతో పోలీసులు సర్టిఫికేట్‌ను అందజేశారు.